
- నా ఆట కొంత మందికైనా స్ఫూర్తినిస్తే చాలు
న్యూఢిల్లీ: ఒంటి చేతితో ఆడినా, ఒంటి కాలితో ఆడినా, గెలుపు కోసమే తాను పోరాడతానని ఆంధ్ర రంజీ టీమ్ కెప్టెన్ హనుమ విహారి అన్నాడు. సెంచరీ చేసినా, చేయకపోయినా టీమ్‌కు తన సహకారం అందాలని కోరుకుంటానని చెప్పాడు. ‘నేను గెలవడం కోసమే గ్రౌండ్లోకి వెళ్తా. నా ప్రధాన లక్ష్యం కూడా అదే. పర్సనల్ మైల్స్టోన్ గురించి ఆలోచించను. టీమ్‌లోకి రీ ఎంట్రీ కోసం భారీ స్కోర్లు చేయాలని అనుకోను. ఆంధ్రాకు ఆడినా, ఇండియాకు ఆడినా గెలవడమే నా లక్ష్యం. ఇందుకోసం ఒంటి చేత్తో అయినా, ఒంటి కాలితోనైనా బ్యాటింగ్ చేస్తా’ అని విహారి పేర్కొన్నాడు. మధ్యప్రదేశ్‌తో ముగిసిన రంజీ ట్రోఫీ క్వార్టర్ఫైనల్లో ముంచేతి ఫ్రాక్చర్‌కు గురైన విహారి.. రెండు ఇన్నింగ్స్‌ల్లో ఒంటిచేత్తో బ్యాటింగ్ చేసి అందరి ప్రశంసలు అందుకున్నాడు. ఈ నేపథ్యంలో అతను బ్యాటింగ్ చేయడానికి దారితీసిన పరిస్థితులపై మాట్లాడాడు. ‘ఆవేశ్ వేసిన షార్ట్ బాల్ నా ఎడమ ముంజేతిని బలంగా తాకింది. గతంలో ఎప్పుడూ అలాంటి నొప్పిని చూడలేదు. ఏదో జరిగిందని అప్పుడే అనుకున్నా. బ్యాటింగ్ కంటిన్యూ చేయాలనుకున్నా.. బ్యాట్‌పై గ్రిప్ దొరక్కపోవడంతో పెవిలియన్‌కు వెళ్లిపోయా. ఎక్స్‌రే తీసిన తర్వాత చిన్న ఫ్రాక్చర్ అయ్యిందని తేలింది. ఆరు వారాలు రెస్ట్ అవసరమని డాక్టర్లు చెప్పారు. దీంతో చాలా నిరాశ చెందా. ఎందుకంటే 113 మ్యాచ్‌ల తర్వాత రంజీ ట్రోఫీలో నేను తొలి క్వార్టర్‌ఫైనల్ ఆడుతున్నా. ఇందుకోసం బాగా ప్రిపేర్ కూడా అయ్యా’ అని విహారి తెలిపాడు.
తప్పనిసరి పరిస్థితుల్లోనే..
తొలి రోజు మంచి స్కోరుతో ఉన్న తాము రెండో రోజు ఘోరమైన స్థితిలో పడిపోయామని విహారి చెప్పాడు. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో బ్యాటింగ్‌కు రావాల్సి వచ్చిందన్నాడు. ‘లెఫ్ట్ హ్యాండ్‌తో బ్యాటింగ్ చేయొద్దని అనుకుని క్రీజులోకి వచ్చా. వచ్చే ముందు నా టీమ్మేట్స్ చేతికి ప్యాడ్స్ కట్టారు. డ్రెస్సింగ్ రూమ్‌లో ఒకటి, రెండుసార్లు ప్రాక్టీస్ చేసి క్రీజులోకి వచ్చా. టెన్నిస్ బాల్ క్రికెట్ ఆడేటప్పుడు కూడా నేను లెఫ్ట్ హ్యాండ్‌తో బ్యాటింగ్ చేయలేదు. ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లో ఇలాంటి పరిస్థితి వస్తుందని ఊహించలేదు. నా ఆట కొంత మందికైనా స్ఫూర్తినిస్తే చాలు. అదే నాకు సంతోషం. ఫిజియో కూడా నాకు రిస్ట్రిక్షన్స్ పెట్టలేదు. కాకపోతే మళ్లీ బాల్ తగిలితే సర్జరీ చేయాల్సి వస్తుందని చెప్పారు’ అని ఈ హైదరాబాదీ వ్యాఖ్యానించాడు.
అంతా టీమ్ కోసమే..
టీమ్ కోసం తాను ఎంతవరకైనా పోరాడతానని విహారి చెప్పాడు. ‘నేను ఫస్ట్ బాల్‌కు ఔటైనా ఫర్వాలేదనుకున్నా. కానీ గ్రౌండ్లోకి అయితే వెళ్లాలనుకున్నా. అన్నింటికంటే టీమ్ ప్రయోజనాలే ముఖ్యమని నా తోటి ప్లేయర్లకు చూపెట్టాలనుకున్నా. నేను అక్కడ ఉంటే మిగతా పది మంది గెలిచేందుకు కృషి చేస్తారన్నది నా నమ్మకం. కఠినమైన గ్రూప్ దశను దాటి మేం క్వార్టర్స్‌కు చేరాం. కాబట్టి దానిని కొనసాగించాలని అనుకున్నాం. కానీ దురదృష్టవశాత్తూ మేం అనుకున్న ఫలితం రాలేదు’ అని విహారి వెల్లడించాడు. తాను లెఫ్ట్ హ్యాండ్ బ్యాటింగ్ చేయడంతో ఎంపీ టీమ్‌లో చాలా మంది ఆశ్చర్యపోయారన్నాడు. గాయమైన రోజు కేవలం పెయిన్ కిల్లర్ ట్యాబ్లెట్లు మాత్రమే తీసుకున్నానని చెప్పిన విహారి నిద్ర పట్టలేదన్నాడు. రెండో ఇన్నింగ్స్‌లో స్పిన్నర్ల బౌలింగ్‌లో ముందుకొచ్చి ఆడింది కేవలం బాల్‌ను టచ్ చేయడం కోసమేనని చెప్పాడు.