- చెరువును వ్యర్థాలతో నింపి..
- షెడ్లతో కబ్జాకు యత్నిస్తున్నారని ఆరోపణ
హైదరాబాద్ సిటీ, వెలుగు : రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం నార్సింగ్ విలేజ్‌కు సమీపంలోని ముష్కిన్ చెరువో ఎఫ్‌టీఎల్ పరిధిలో తాత్కాలిక షెడ్డుల్లో ఉన్న వారు ఖాళీ చేసి వెళ్లాలని హైడ్రా అధికారులు బుధవారం ఆదేశించారు. హైడ్రా అడిషనల్ డైరెక్టర్ వర్ల పాపయ్య, ఏసీపీ తిరుమల్, ఇరిగేషన్ శాఖ డీఈ రమాదేవి, ఇతర అధికారులు షెడ్లు వేసుకుని ఉంటున్న వారితో మాట్లాడారు. షెడ్లు ఖాళీ చేస్తే చెరువును అభివృద్ధి చేస్తామని, చెరువు అభివృద్ధి పనులు చేసేవారికి ఆటంకాలు కల్పించవద్దని హైడ్రా అధికారులు సూచించారు. 10 రోజులు సమయం ఇస్తున్నామని, ప్రత్యామ్నాయం చూసుకోవాలని సూచించారు.
ఎఫ్టీఎల్ పరిధి 52.20 ఎకరాలు....
హెచ్ఎండీఏ నిర్ధారించిన మేరకు ముష్కిన్ చెరువు ఎఫ్టీఎల్ పరిధి 52.20 ఎకరాలు కాగా, బఫర్ తో కలిపి 62 ఎకరాల వరకూ ఉంటుందని హైడ్రా చెప్తోంది. దీని ఎఫ్టీఎల్ను ఆక్రమించి నిర్మాణ వ్యర్థాలతో నింపేసి.. తాత్కాలిక షెడ్లతో కబ్జా చేయాలనుకుంటున్నారని అంటోంది. త్వరలో బడా నిర్మాణాలు చేపట్టాలని ప్లాన్చేస్తున్నారని చెప్తోంది. ఇంటింటికీ వెళ్లి సేకరించిన చెత్తను తెచ్చి చెరువు పరిధిలో పడేస్తున్నారని, ఇక్కడే చెత్తను వేరు చేసి వ్యర్థాలను చెరువులోకి వదిలేస్తున్నారని అంటోంది. 34 ఎకరాలు శిఖం పట్టా కింద గతంలో రైతులకు అప్పగించగా, వ్యవసాయం చేసుకునేవారని, కానీ, కొన్నాళ్లుగా ఈ భూముల్లో నిర్మాణాలు చేపట్టాలని కొన్ని నిర్మాణ సంస్థలు ప్లాన్ చేస్తున్నాయని ఆరోపిస్తోంది.

