V6 News

మా కొత్త ఆయుధాలతో ట్రంప్ కు గుండెపోటు తెప్పిస్తాం : ఎగతాళిగా హెచ్చరించిన ఇరాన్..

మా కొత్త ఆయుధాలతో ట్రంప్ కు గుండెపోటు తెప్పిస్తాం : ఎగతాళిగా హెచ్చరించిన ఇరాన్..

తమ సైనిక శక్తిని చాటుకునేందుకు ఇరాన్ తాజాగా ఒక కొత్త ఆయుధాన్ని సిద్ధం చేసింది. దీనిని అమెరికా, ఇజ్రాయెల్‌లపై ప్రయోగిస్తామని హెచ్చరించింది. ఈ ఆయుధం తమ శత్రువులకు "గుండెపోటు" తెప్పించేంత శక్తివంతమైనదని ఇరాన్ పేర్కొంది. ఇరాన్ పంపిన మూడు సూత్రాల ప్రతిపాదనను అమెరికా తిరస్కరించడం, అలాగే ఇరాన్ చమురు పైప్‌లైన్‌లు త్వరలోనే పేలిపోవచ్చు అని అమెరికా హెచ్చరించిన నేపథ్యంలో ఇరాన్ ఈ ఘాటు వ్యాఖ్యలు చేసింది.

శత్రువులకు భయం పుట్టిస్తాం
ఇరాన్ నౌకాదళ కమాండర్ రియర్ అడ్మిరల్ షహ్రామ్ ఇరానీ మాట్లాడుతూ.. తమ దేశం అంటే భయం పుట్టించే ఒక కొత్త ఆయుధంతో శత్రువులను త్వరలోనే ఎదుర్కొంటామని చెప్పారు. ఇరాన్ సైన్యాన్ని పూర్తిగా నాశనం చేస్తామన్న డొనాల్డ్ ట్రంప్ మాటలను ఆయన ఎగతాళి చేశారు. ఇరాన్‌ను ఓడించి తమ లక్ష్యాలను సాధిస్తామని శత్రువులు భావిస్తే అది వారి మూర్ఖత్వమేనని, యుద్ధ విద్యలు నేర్పే అకాడమీల్లో ఇలాంటి ఆలోచనలు ఇప్పుడు ఒక జోక్‌గా మారిపోయాయని ఆయన విమర్శించారు.

ఇరాన్ సైన్యం ఇప్పటికే దెబ్బతిందని ట్రంప్ పదేపదే చెబుతున్నారు. ఇరాన్ దగ్గర అణ్వాయుధాలు ఉండటానికి తాము ఎప్పటికీ ఒప్పుకోమని ఆయన స్పష్టం చేశారు. అంతేకాదు, అమెరికా విధిస్తున్న ఆంక్షల వల్ల ఇరాన్ గ్యాస్, చమురు పైప్‌లైన్‌లు త్వరలోనే పేలిపోతాయని ట్రంప్ హెచ్చరించారు. అణు కార్యక్రమంపై తమకు అనుకూలమైన ఒప్పందం కుదిరే వరకు ఈ ఆంక్షలు కొనసాగుతాయని ఆయన బుధవారం మరోసారి నొక్కి చెప్పారు.

చమురు ధరల సెగ
పైప్‌లైన్‌లు పేలిపోతాయన్న ట్రంప్ హెచ్చరికలను ఇరాన్ ఎగతాళి చేసింది. ట్రంప్ చెప్పినట్లుగా ఇప్పటివరకు ఏ ఒక్క చమురు బావి కూడా పేలలేదని గుర్తుచేసింది. ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ బఘేర్ ఘాలిబాఫ్ సోషల్ మీడియా (X) వేదికగా స్పందిస్తూ.. అమెరికా ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెస్సెంట్ ఇస్తున్న తప్పుడు సలహాల వల్ల ముడి చమురు ధరలు త్వరలోనే బ్యారెల్‌కు 140 డాలర్లకు చేరుకోవచ్చని హెచ్చరించారు.

"మూడు రోజులు గడిచినా ఒక్క చమురు బావి కూడా పేలలేదు. కావాలంటే మరో 30 రోజులు దీనిని ప్రత్యక్ష ప్రసారం (Live) చేసి చూపిస్తాం. ఇలాంటి పనికిమాలిన సలహాల వల్ల చమురు ధర ఇప్పటికే 120 డాలర్లకు పెరిగింది, తదుపరి లక్ష్యం 140 డాలర్లు అని ఆయన విమర్శించారు.