వందేమాతరం బిల్లుకు రాజ్యసభ ఆమోదం

వందేమాతరం బిల్లుకు రాజ్యసభ ఆమోదం
  • లోక్‌‌‌‌సభ, రాష్ట్రపతి ఆమోదం తర్వాతే చట్టంగా మారనున్న బిల్లు
  • ఈ చట్టం ప్రకారం జాతీయ గేయాన్ని అవమానిస్తే మూడేళ్ల జైలు శిక్ష

న్యూఢిల్లీ: జాతీయ గేయం 'వందేమాతరం'ను అవమానించడాన్ని తీవ్ర నేరంగా పరిగణించే చట్ట సవరణ బిల్లుకు రాజ్యసభ ఆమోదం తెలిపింది. బుధవారం నీట్ పేపర్ లీక్ అంశంపై ప్రతిపక్షాలు నిరసనలు తెలుపుతున్నప్పటికీ.. ప్రభుత్వం సభలో బిల్లుపై చర్చ కొనసాగించింది. లంచ్ బ్రేక్ తరువాత రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌‌‌‌ హరివంశ్‌‌‌‌ అనుమతితో 'ది ప్రివెన్షన్ ఆఫ్ ఇన్సల్ట్స్ టు నేషనల్ హానర్ (అమెండ్‌‌‌‌మెంట్) బిల్లు~2026'లో సవరణలు చేయాలని కేంద్రం ప్రతిపాదించింది. 

అయితే, ఈ చర్చను ప్రతిపక్షాలు బహిష్కరించి సభ నుంచి వాకౌట్ చేశాయి. బిల్లుపై చర్చ సందర్భంగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ మాట్లాడుతూ.. రాజకీయ లబ్ధి కోసం కాంగ్రెస్ పార్టీ దేశ గౌరవానికి ప్రతీక అయిన వందేమాతరాన్ని అవమానిస్తోందని ఆరోపించారు. వందేమాతరాన్ని వ్యతిరేకించడం దేశద్రోహ శక్తుల నైతికతను బలపరచడమేనని మండిపడ్డారు. ఈ గేయాన్ని ప్రముఖ రచయిత బంకించంద్ర చటోపాధ్యాయ 1875లో రచించారని గుర్తుచేశారు. 

వందేమాతర గేయం భవిష్యత్తులో ఇది ప్రతి భారతీయుడి నోట మంత్రంలా మారుతుందని బంకించంద్ర అప్పట్లో ఆకాంక్షించారని వివరించారు. కానీ, 1937లో నాటి ప్రధాని జవహర్‌‌‌‌లాల్ నెహ్రూ వందేమాతరాన్ని కేవలం రెండు చరణాలకే పరిమితం చేశారని విమర్శించారు. 

ఎంతోమంది స్వాతంత్ర్య సమరయోధులు దేశం కోసం ప్రాణాలు అర్పించే సమయంలో తమ చివరి మాటలుగా వందేమాతరాన్ని స్మరించుకున్నారని కొనియాడారు. 'ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్' ఆవిష్కరణకు వందేమాతరం ఎంతో అవసరమని.. జాతీయ చిహ్నాల గౌరవం రాజకీయాలకు అతీతంగా ఉండాలని నిత్యానంద్ రాయ్ స్పష్టం చేశారు.

త్వరలో లోక్ సభకు బిల్లు..

సభ్యుల అభిప్రాయాలు, చర్చల అనంతరం రాజ్యసభ వాయిస్ ఓటు ద్వారా ది ప్రివెన్షన్ ఆఫ్ ఇన్సల్ట్స్ టు నేషనల్ హానర్ (అమెండ్‌‌‌‌మెంట్) బిల్లు అధికారికంగా ఆమోదం పొందింది. నేషనల్ హానర్ యాక్ట్, 1971ను సవరిస్తూ ఈ కొత్త బిల్లును జులై 24వ తేదీన సభలో ప్రవేశపెట్టారు. 

కాగా, ఈ బిల్లును త్వరలో లోక్ సభలో ప్రవేశ పెట్టేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. లోక్ సభలో బిల్లు పాసయ్యాక రాష్ట్రపతి ఆమోదం పొందవలసి ఉంది. బిల్లు చట్టంగా మారాక జాతీయ జెండా, రాజ్యాంగం, జాతీయ గీతంతో పాటు ఇప్పుడు వందేమాతరాన్ని అవమానించడాన్ని కూడా  నేరంగా పరిగణిస్తారు. దోషులకు గరిష్టంగా మూడేళ్ల వరకు జైలు శిక్ష విధించే అవకాశం ఉంది.