టోర్నడో బీభత్సం.. 114 చెట్లు నేలమట్టం...విధ్వంసాన్ని పరిశీలించిన ఫారెస్ట్ అధికారులు

టోర్నడో బీభత్సం.. 114 చెట్లు నేలమట్టం...విధ్వంసాన్ని పరిశీలించిన  ఫారెస్ట్ అధికారులు

మంగపేట, వెలుగు: ములుగు జిల్లా మంగపేట మండలం కోమటిపల్లి సమీపంలో మంగళవారం సాయంత్రం టోర్నడో తరహా భారీ గాలులు బీభత్సం సృష్టించాయి. సుమారు 5:30 గంటలకు నిమిషాల వ్యవధిలోనే భారీ వృక్షాలు నేలకూలడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. పొలాల్లో వరి నాట్లు వేస్తున్న రైతులు, కూలీలు పనులు వదిలేసి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరుగులు తీశారు. మంగపేటకు చెందిన రావుల రామస్వామి ఈ గాలి బీభత్సాన్ని వీడియో తీశారు. ఆ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌‌‌‌గా మారింది. 

టోర్నడో ప్రభావిత ప్రాంతాన్ని బుధవారం అటవీశాఖ అధికారులు పరిశీలించారు. రాత్రి చీకటి కారణంగా సర్వే నిలిపివేసి, బుధవారం ఉదయం ఇన్‌‌‌‌చార్జి ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ నాయక్ హుస్సేన్ ఆధ్వర్యంలో మూడు బృందాలుగా పరిశీలన చేపట్టారు. శాంతినగర్–గొత్తికోయగూడెం–కోమటిపల్లి మార్గంలో ఒక బృందం పరిశీలించినా ఆనవాళ్లు కనిపించలేదు. మరో బృందం మంగపేట నార్త్ బీట్ పరిధిలో పరిశీలించగా కమలాపురం సమీపంలోని జామ్ ఆయిల్ ప్లాంటేషన్ నుంచి సుమారు రెండు కిలోమీటర్ల మేర, 100 మీటర్ల వెడల్పులో గాలి బీభత్సం ఆనవాళ్లు గుర్తించారు. 

ఈ మార్గంలో మొత్తం 114 చెట్లు నేలకూలగా, వాటిలో 60 జామ్ ఆయిల్ చెట్లు, 46 భారీ వృక్షాలు ఉన్నట్లు మంగపేట సౌత్ బీట్ ఆఫీసర్ ప్రశాంత్ తెలిపారు. గాలి గొత్తికోయగూడెం వైపు దూసుకెళ్లినా గ్రామానికి పెను ప్రమాదం తప్పిందన్నారు.

డ్రోన్ సర్వేతో పూర్తి అంచనా..

వర్షాల కారణంగా డ్రోన్ సర్వే నిర్వహించలేకపోయామని, వాతావరణం అనుకూలించిన వెంటనే డ్రోన్ సర్వే చేసి నష్టాన్ని అంచనా వేసి ఉన్నతాధికారులకు నివేదిక అందజేస్తామని అటవీశాఖ అధికారులు తెలిపారు. గత రెండేళ్లుగా మేడారం ప్రాంతంలో కనిపించిన టోర్నడో తరహా గాలులు వరుసగా రెండోసారి మంగపేట మండలంలోనూ సంభవించడంతో స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.