గట్టెక్కిన పత్తి.. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో కళకళలాడుతున్న చేన్లు

గట్టెక్కిన పత్తి.. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో కళకళలాడుతున్న చేన్లు
  • ఎల్​నినో ప్రభావంతో రెండు నెలలుగా తీవ్ర వర్షాభావం
  • అల్పపీడనం, వాయుగుండంతో కురుస్తున్న వర్షాలతో జీవం పోసుకున్న పంటలు
  • పలు మండలాల్లో పూత దశకు చేరిన పత్తి.. ఏపుగా పెరుగుతున్న కంది, జొన్న

మహబూబ్​నగర్, వెలుగు: ఉమ్మడి మహబూబ్​నగర్​ జిల్లాలో ఎట్టకేలకు వరుణుడు కరుణించడంతో అన్నదాతలు ఊపిరి పీల్చుకున్నారు. ఇక పత్తి పంట గట్టెక్కినట్లేనని భావిస్తున్నారు. ఎల్​ నినో కారణంగా గత రెండు నెలలుగా తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఏర్పడి రైతులు ఇబ్బందులు పడ్డారు. 

తాజాగా అల్పపీడనం, వాయుగుండం ప్రభావంతో కురుస్తున్న వర్షాల కారణంగా ఎండిపోతున్న దశలో ఉన్న పంటలన్నీ ఒక్కసారిగా జీవం పోసుకున్నాయి. వారం రోజుల కింద వరకు వాడిపోయిన చేన్లన్నీ ఇప్పుడు పచ్చగా కళకళలాడుతుండడంతో రైతుల మొఖాల్లో ఆనందం వెల్లివిరుస్తోంది.

పూత దశకు చేరుకున్న పత్తి చేన్లు
ఉమ్మడి మహబూబ్​నగర్​ జిల్లాలో ఈ వానాకాలం సీజన్​లో దాదాపు 7.3 లక్షల ఎకరాల్లో పత్తి సాగవుతుందని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. మే నెలలో రోహిణి కార్తె ప్రారంభం కాగానే రైతులు విత్తనాలు వేశారు. జూన్​లో తొలి వానలకే దాదాపు 80 శాతం పంటలు సాగులోకి వచ్చాయి. అయితే, ఆ తర్వాత ఎల్​ నినో ఎఫెక్ట్​తో వానలు పూర్తిగా ముఖం చాటేయడంతో విత్తనాలు భూమిలోనే కుళ్లిపోయాయి.

దీంతో దిక్కుతోచని స్థితిలో రైతులు స్ప్రింకర్లు, ట్యాంకర్ల ద్వారా తడులు అందించేందుకు ప్రయత్నించినప్పటికీ చాలా చోట్ల పంటలు దెబ్బతిన్నాయి. పరిస్థితిని చక్కదిద్దేందుకు కొందరు రైతులు ఈ నెల రెండో వారంలో మరోసారి చేలను దున్ని మళ్లీ పత్తి విత్తనాలు విత్తుకున్నారు. 

ఈ క్రమంలోనే వాతావరణంలో మార్పులొచ్చి ఈ నెల 20 నుంచి అల్పపీడనం, 26 నుంచి వాయుగుండం ప్రభావంతో మోస్తరు వర్షాలు కురిశాయి. దీంతో భూమి పదునెక్కి రోహిణి కార్తెలో వేసిన పత్తి ఒకటిన్నర ఫీటు ఎత్తు పెరిగి పూత, గూడు పట్టే దశకు చేరుకుంది. రెండోసారి విత్తినవి అర ఫీటుకు పైగా పెరిగి పచ్చదనంతో కళకళలాడుతున్నాయి.

కంది, జొన్న, మక్క పంటలకూ మేలు..  
వరి, పత్తితో పాటు ఉమ్మడి మహబూబ్​నగర్  జిల్లాలో ఎక్కువగా సాగవుతున్న కంది, జొన్న, మక్క పంటలకు కూడా ఈ వర్షాలు నూతన జీవాన్నిచ్చాయి. ఈ వానాకాలంలో ఈ మూడు పంటలు లక్ష ఎకరాలకు పైగా సాగవుతాయని అంచనా ఉండగా, వర్షాభావం వల్ల ఇవి కూడా ఒక దశలో ఎండిపోయే పరిస్థితికి చేరాయి. ప్రస్తుతం కురుస్తున్న వర్షాల వల్ల ఈ చేన్లూ ఏపుగా పెరుగుతున్నాయి. ప్రకృతి అనుకూలించి పంటలు గట్టెక్కడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.