వరంగల్/కరీమాబాద్, వెలుగు: వరంగల్ ఉర్సుగుట్ట వద్ద మాద అనిల్(23) హత్యకు పాత కక్షలే కారణమని మిల్స్ కాలనీ పోలీసులు వెల్లడించారు. ఘటన జరిగిన 72 గంటల్లోనే కేసును ఛేదించి నలుగురు నిందితులను అరెస్ట్ చేసినట్లు ఇన్‌స్పెక్టర్ కర్రె స్వామి బుధవారం తెలిపారు. ఈ నెల 25న ఉర్సుగుట్టలోని ఆకుతోట ఫంక్షన్ హాల్ ఎదురుగా ఉన్న సీపీఎం కాలనీ సమీపంలో ఖిలా వరంగల్ బీఆర్ నగర్‌కు చెందిన మాద అనిల్‌ను దారుణంగా హత్య చేశారు.
విచారణలో.. 2023 వినాయక చవితి సందర్భంగా డీజే విషయంలో అనిల్‌కు, అదే ప్రాంతానికి చెందిన రౌడీషీటర్ గిరిబోయిన మహేందర్‌కు మధ్య గొడవ జరిగినట్లు తేలింది. ఆ కక్షతోనే అదే ఏడాది డిసెంబర్ 31న అనిల్ తన అనుచరులతో కలిసి మహేందర్‌పై దాడి చేయగా, అప్పట్లో అతనిపై కేసు నమోదైంది. ఆ తర్వాత హైదరాబాద్‌లో ఉంటున్న అనిల్.. బోనాల పండుగ సందర్భంగా ఈ నెల 25న స్వగ్రామానికి వచ్చాడు. విషయం తెలుసుకున్న మహేందర్.. తన మిత్రులు కంప రాజేశ్(35), భూక్య పూర్ణచందర్(24), కొండపాక కమలేశ్(19)తో కలిసి పదునైన ఫోల్డింగ్ కత్తితో అనిల్‌పై దాడి చేశాడు. గొంతు కోసి, ఛాతిలో పొడవడంతో అనిల్ అక్కడికక్కడే మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.
దర్యాప్తు చేపట్టిన పోలీసులు మంగళవారం ఆర్టీఏ జంక్షన్ వద్ద వాహనాల తనిఖీలు నిర్వహించి నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. నేరాన్ని అంగీకరించడంతో రిమాండ్‌కు తరలించారు. ఈ సందర్భంగా సీఐ కర్రె స్వామి మాట్లాడుతూ.. వరంగల్ కమిషనరేట్‌లో రౌడీయిజం, హింస, గ్యాంగ్ గొడవల విషయంలో జీరో టాలరెన్స్ విధానాన్ని కఠినంగా అమలు చేస్తామని తెలిపారు.
