యువతను కించపర్చడం సిగ్గుచేటు... కంగన తీరుపై సోనూసూద్ కామెంట్

యువతను కించపర్చడం సిగ్గుచేటు... కంగన తీరుపై సోనూసూద్ కామెంట్

న్యూఢిల్లీ: జెన్ జీ నిరసనకారులపై బీజేపీ ఎంపీ, నటి కంగనా రనౌత్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై ప్రముఖ నటుడు సోనూ సూద్ తీవ్రంగా స్పందించారు. కంగనా వ్యాఖ్యలు సిగ్గు చేటు అని, అలా మాట్లాడి ఉండకూడదని తెలిపారు. మనం మాట్లాడే ముందు ప్రతి మాటనూ ఆచితూచి మాట్లాడాలని, ఎందుకంటే ప్రజలే దేవుని మరో రూపం అని హితవు పలికారు. ఈమేరకు బుధవారం మీడియాతో  సోనూ సూద్ మాట్లాడారు. యువత ప్రాముఖ్యతను వివరించారు. 

యువతను గౌరవించాలని, సమాజంలో వారి పాత్ర ఎంతో కీలకమని ఆయన స్పష్టం చేశారు. యువతే నటీనటులను తయారు చేస్తుందని, తామిద్దరం ఈ స్థాయికి చేరుకోవడానికి వారే కారణమని తెలిపారు. వారు తమ వెంట ఉన్నంత కాలం రాణిస్తామని, ఒకవేళ వారు దూరమైతే ముందుకు సాగడం కష్టమవుతుందని అభిప్రాయపడ్డారు. 

వృత్తి ఏదైనా సరే నటుడైనా, డాక్టరైనా లేదా వేరేదైనా కావొచ్చు... ప్రజలతో సంబంధం ఉన్నంత వరకే ఈ ప్రపంచంలో తమ అస్తిత్వానికి ఒక అర్థం ఉంటుందని పేర్కొన్నారు.