రైతులకు గుడ్ న్యూస్ : జూలైలో రైతుల ఖాతాల్లో 2 వేల రూపాయలు

రైతులకు గుడ్ న్యూస్ : జూలైలో రైతుల ఖాతాల్లో 2 వేల రూపాయలు

పీఎం-కిసాన్ లబ్ధిదారులకు  కీలక అలర్ట్.  ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద లబ్ధి పొందుతున్న రైతులందరూ తమ ఇ-కేవైసి (e-KYC) ప్రక్రియను వీలైనంత త్వరగా పూర్తి చేసుకోవాలని స్పష్టం చేసింది కేంద్రం. అర్హులైన రైతులకు ఎలాంటి ఆలస్యం లేకుండా ఆర్థిక సహాయం అందించేందుకే... ప్రభుత్వం ఇ-కేవైసిని తప్పనిసరి చేసిన సంగతి తెలిసిందే. 

ఈ పథకం కింద, అర్హులైన రైతులకు ప్రతి సంవత్సరం రూ. 6 వేల ఆర్థిక సహాయం అందుతుందనే విషయం తెలిసిందే. ఈ మొత్తాన్ని ఒక్కొక్కటి రూ. 2 వేల చొప్పున, మూడు సమాన వాయిదాలలో నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలకే బదిలీ చేస్తారు. ప్రభుత్వం ఇప్పటివరకు విజయవంతంగా 22 విడతలను విడుదల చేసింది.

సాధారణంగా ప్రతి 4 నెలల విరామం తర్వాత ఒక విడత డబ్బులు జమ అవుతాయి. గత విడత వచ్చి దాదాపు నాలుగు నెలలు కావస్తుండటంతో... రైతులంతా ఇప్పుడు 23వ విడత కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాధారణ షెడ్యూల్ ప్రకారం, ఈ తదుపరి విడత 2026 జూలైలో విడుదలయ్యే అవకాశం ఉందని నివేదికలు చెబుతున్నాయి. అయితే, దీనిపై ప్రభుత్వం ఇంకా అధికారిక తేదీని ప్రకటించాల్సి ఉంది.

ఈ 23వ విడత డబ్బులు మీకు అందాలంటే.. ఇ-కేవైసి పూర్తి చేయడానికి '2026 జూన్ 30'ని చివరి గడువుగా నిర్ణయించారు.  గడువులోగా ఇ-కేవైసి పూర్తి చేయని రైతులు రాబోయే విడత పీఎం కిసాన్ డబ్బులు పడకపోవచ్చు. 

ఇ-కేవైసి (e-KYC) ఎలా పూర్తి చేయాలి?

  • మీ సమీపంలోని కామన్ సర్వీస్ సెంటర్ (CSC) కి వెళ్లి బయోమెట్రిక్ ద్వారా పూర్తి చేసుకోవచ్చు.
  • లేదా ఇంట్లోనే ఉండి, అధికారిక పిఎం-కిసాన్ పోర్టల్ (PM-Kisan Portal) ద్వారా ఆన్‌లైన్‌లో మీ ఆధార్ ఓటీపీ సాయంతో ఉచితంగా పూర్తి చేసుకోవచ్చు.
  •  జూన్ 30 లోపే మీ ఇ-కేవైసి పూర్తి చేసుకోవాలి