
పారిస్: ప్రధాని నరేంద్ర మోదీ మరో అరుదైన పురస్కారాన్ని అందుకున్నారు. పారిస్‌లోని ఎలిసీ ప్యాలెస్‌లో జరిగిన కార్యక్రమంలో ప్రాన్స్ అత్యున్నత పౌర, మిలిటరీ అవార్డు ‘గ్రాండ్ క్రాస్ ఆఫ్ ది లెజియన్ ఆనర్’ను మోదీకి ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్ అందజేశారు. ఈ పురస్కారాన్ని అందుకున్న తొలి భారత ప్రధాని మోదీనే కావడం గమనార్హం. తద్వారా నెల్సన్ మండేలా, కింగ్ చార్లెస్, ఏంజెలా మెర్కెల్ తదితరుల సరసన ఆయన నిలిచారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం గురువారం ఫ్రాన్స్‌కు వెళ్లిన మోదీకి.. రెడ్ కార్పెట్‌పై ఘన స్వాగతం లభించింది. శుక్రవారం జరిగిన ఫ్రెంచ్ నేషనల్ డే సెలబ్రేషన్స్‌లో ముఖ్య అతిథిగా ఆయన పాల్గొన్నారు. ‘‘గ్రాండ్ క్రాస్ ఆఫ్ ది లెజియన్ ఆఫ్ ఆనర్’ని అత్యంత వినయంతో స్వీకరిస్తున్నా. ఇది 140 కోట్ల మంది ఇండియన్లకు దక్కిన గౌరవం. ప్రెసిడెంట్ మేక్రాన్, ఫ్రెంచ్ ప్రభుత్వం, ప్రజలకు ధన్యవాదాలు” అని ప్రధాని ట్వీట్ చేశారు.
బాస్టిల్లె డే పరేడ్‌లో త్రివిధ దళాలు
బాస్టిల్లె డే పరేడ్‌లో ముఖ్యఅతిథిగా మోదీ హాజరయ్యారు. మేక్రాన్‌తో కలిసి ఈ పరేడ్‌ను వీక్షించారు. ఫ్రెంచ్ నేషనల్ డే సెలబ్రేషన్స్‌లో భాగంగా నిర్వహించిన పరేడ్‌లో భారత త్రివిధ దళాలు పాల్గొన్నాయి. ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన రాఫెల్ జెట్లు కూడా ఫ్లైపాస్ట్‌లో భాగమయ్యాయి. ‘సారే జహా సె అచ్ఛా’ అంటూ గీతం వినిపించగా.. 269 మందితో కూడిన ఇండియన్ ట్రై సర్వీసెస్ కంటింజెంట్ పరేడ్ చేసింది. వేదికను భారత బృందం దాటుకుని వెళ్లేటప్పుడు ప్రధాని సెల్యూట్ చేశారు. పరేడ్ కొనసాగుతున్నంత సేపు.. ఆ కవాతు గురించి మోదీకి మేక్రాన్ వివరిస్తూ కనిపించారు. ‘‘ప్రపంచ చరిత్రలో ఒక దిగ్గజం.. భవిష్యత్తులో నిర్ణయాత్మక పాత్ర పోషించనున్న.. వ్యూహాత్మక భాగస్వామి, స్నేహితుడు.. జులై 14న పరేడ్‌లో గౌరవ అతిథిగా భారతదేశాన్ని స్వాగతిస్తున్నందుకు మేం గర్విస్తున్నాం’’ అని అంతకుముందు మేక్రాన్ ట్వీట్ చేశారు. 140 కోట్ల మంది ఇండియన్లకు దక్కిన గౌరవం: మోదీ
ఫ్రాన్స్‌లో ఇండియా యూపీఐ
ఇండియాలో విజయవంతంగా అమలవుతున్న నగదు చెల్లింపుల వ్యవస్థ ‘యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (యూపీఐ)’ సేవలు ఫ్రాన్స్‌లోనూ ప్రారంభం కానున్నాయని ప్రధాని వెల్లడించారు. ‘‘ఫ్రాన్స్‌లో యూపీఐ చెల్లింపుల సేవలను ప్రారంభించేందుకు ఇరు దేశాలు అంగీకరించాయి. త్వరలోనే ఈఫిల్ టవర్ వద్ద ఈ సేవలు ప్రారంభమవుతాయి. ఈ ప్రాంతాన్ని చూడడానికి వచ్చే భారత పర్యాటకులు భారత కరెన్సీ అయిన రూపాయిని ఇక్కడ చెల్లింపుల కోసం వాడవచ్చు’’
అని మోదీ తెలిపారు.
స్టూడెంట్లకు ఐదేండ్ల వీసా
ఫ్రాన్స్‌లో మాస్టర్స్ డిగ్రీ చదివే స్టూడెంట్లకు ఐదేండ్ల పోస్ట్ స్టడీ వీసా ఇవ్వనున్నట్లు ప్రధాని మోదీ ప్రకటించారు. ఫ్రాన్స్‌లో మాస్టర్స్ డిగ్రీలు చదువుతున్న భారతీయ విద్యార్థులకు ప్రస్తుతం రెండేండ్ల వర్క్ వీసా మాత్రమే ఇస్తుండగా.. ఇప్పుడు ఐదేండ్లకు పెరగనుంది. పారిస్‌లోని ఎల్‌ఏ సెయిన్ మ్యూజికేల్‌లో భారతీయులను ఉద్దేశించి ప్రధాని మాట్లాడుతూ, ‘‘నేను గతంలో ఇక్కడికి వచ్చినప్పుడు.. ఫ్రాన్స్‌లో మాస్టర్స్ డిగ్రీని అభ్యసిస్తున్న భారతీయ విద్యార్థులకు 2 సంవత్సరాల పోస్ట్ -స్టడీ వర్క్ వీసా ఇవ్వాలని నిర్ణయించారు. ఇప్పుడు విద్యార్థులకు ఐదేళ్ల దీర్ఘకాలిక పోస్ట్ -స్టడీ వీసా ఇవ్వాలని నిర్ణయించారు” అని వెల్లడించారు.