- ‘మార్నింగ్ కన్సల్ట్’ సర్వేలో వెల్లడి
వాషింగ్టన్: ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన నాయకుడిగా నిలిచారు. మొత్తం 24 ప్రజాస్వామ్య దేశాల్లోని అగ్ర నేతల ప్రజాదరణపై అమెరికాకు చెందిన ప్రముఖ పరిశోధనా సంస్థ ‘మార్నింగ్ కన్సల్ట్’ రీసెర్చ్ చేసింది. ఈ సర్వే రిపోర్టులో మోదీ 70% రేటింగ్‌ను సాధించి మోస్ట్ పాపులర్ లీడర్ గా అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నారు.
అంతర్జాతీయంగా ఎదురవుతున్న సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కోవడంతో పాటు, దేశీయంగా చేపట్టిన అభివృద్ధి పథకాలే మోదీకి ఎక్కువ ప్రజాదరణను తెచ్చిపెట్టినట్లు నివేదిక వెల్లడించింది. మోదీ తర్వాత దక్షిణ కొరియా అధ్యక్షుడు లీ జే-మ్యూంగ్ 63% ఆమోదంతో ప్రజాదరణలో రెండో స్థానంలో, చెక్ రిపబ్లిక్ ప్రధాని ఆండ్రెజ్ బాబిస్ 55% ఆమోదంతో మూడో స్థానంలో నిలిచారు.
ఫ్రీడ్రిచ్కు ప్రజల్లో తక్కువ ఆదరణ
ఇక ప్రజల మెప్పును ప్రపంచంలోనే అత్యంత తక్కువగా పొందిన నేతగా జర్మనీ ఛాన్సలర్ ఫ్రీడ్రిచ్ ఫస్ట్ ప్లేస్‌లో నిలిచి రికార్డు సృష్టించారు. సర్వేలో పాల్గొన్న వారిలో ఏకంగా 76% మంది మెర్జ్ పనితీరు పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అలాగే, ప్రపంచంలో ప్రజల మెప్పును అత్యంత తక్కువగా పొందిన నేతల జాబితాలో 2వ స్థానంలో ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ (75%) నిలిచారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రజా మెప్పును అత్యంత తక్కువగా పొందిన లిస్టులో చివరి నుంచి10వ స్థానంలో ఉన్నారు. కేవలం 38% మంది మాత్రమే ట్రంప్ చేస్తున్న పనులను, ఆయన పరిపాలనను సమర్థిస్తున్నారు.

