విజన్, వికాసానికే ప్రజలు పట్టం కట్టారు: ప్రధాని మోడీ

విజన్, వికాసానికే ప్రజలు పట్టం కట్టారు: ప్రధాని మోడీ

విజన్, వికాసానికే ప్రజలు పట్టం కట్టారని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు.  జేపీ నడ్డా నేతృత్వంలో గుజరాత్ లో  కమల దళం ఎలా వికసించిందో, ఎలా విజయం సాధించిందో మనం ఇవాల్టి ఫలితాల్లో చూశామని పేర్కొన్నారు. యూపీలోని రాంపూర్ లోనూ బీజేపీ గెలిచిందని గుర్తు చేశారు.  ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన విజయోత్సవ సమావేశంలో ప్రధాని మాట్లాడారు. ‘‘ఈసారి గుజరాత్ కమాల్ చేసింది. అందుకుగానూ గుజరాత్ ప్రజలకు నా ధన్యవాదాలు. నరేంద్ర మోడీ రికార్డును ఈసారి అసెంబ్లీ పోల్ లో భూపేంద్ర బద్దలు కొట్టాలన్నాను. గుజరాత్ ప్రజలు అదే చేసి చూపించి కొత్త చరిత్రను లిఖించారు’’ అని ఆయన వ్యాఖ్యానించారు.  

సంచలన నిర్ణయాలు, సాహసోపేత నిర్ణయాలు తీసుకునే ధైర్యం బీజేపీకి మాత్రమే ఉందని, అందుకే ప్రజలు బీజేపీ వెంట నడుస్తున్నారని చెప్పారు. ‘‘1 శాతం కంటే తక్కువ ఓట్ల తేడాతో మేం హిమాచల్ ప్రదేశ్ లో గెలిచే అవకాశాన్ని కోల్పోయాం. బీజేపీని గెలిపించేందుకు ప్రజలు ఎంతో ప్రయత్నించారని దీన్నిబట్టి తెలిసింది. ఫలితం ఎలా ఉన్నా సరే.. కేంద్ర సర్కారు నుంచి హిమాచల్ అభివృద్ధికి కృషి చేస్తం’’ అని మోడీ తెలిపారు. ఎన్నికలు సమర్ధంగా నిర్వహించినందుకు ఎన్నికల సంఘానికి ధన్యవాదాలు తెలిపారు.