కోట్పా చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలి...పొగాకు నియంత్రణపై పీఎంవో కీలక ఆదేశాలు

కోట్పా చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలి...పొగాకు నియంత్రణపై పీఎంవో కీలక ఆదేశాలు

హైదరాబాద్, వెలుగు: దేశవ్యాప్తంగా పొగాకు నియంత్రణ కోసం 'కోట్పా' చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాల్సిన అవసరం ఉందని ప్రధాన మంత్రి కార్యాలయం (పీఎంవో) స్పష్టం చేసింది. పొగాకు రహిత సమాజం కోసం పౌర సరఫరాలశాఖ ఎన్‌ఫోర్స్‌మెంట్ డిప్యూటీ తహసీల్దార్, 'టొబాకో కంట్రోల్ హీరో' అవార్డు గ్రహీత మాచన రఘునందన్ చేసిన విన్నపానికి పీఎంవో సానుకూలంగా స్పందించింది. పొగాకు మహమ్మారిని అరికట్టడంలో కేంద్రంతోపాటు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా చిత్తశుద్ధితో వ్యవహరించాలని పీఎంవో అభిప్రాయపడింది. 

ముఖ్యంగా స్కూళ్లు, కాలేజీల సమీపంలో పొగాకు రహిత వాతావరణాన్ని కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేసింది. ఈ మేరకు సోమవారం హైదరాబాద్‌లో రఘునందన్ వివరాలను వెల్లడించారు. పొగాకు నియంత్రణ చర్యల్లో రాష్ట్రాలు తమ బాధ్యతను సమర్థవంతంగా నిర్వహించాలని కేంద్రం సూచించినట్లు తెలిపారు. సామాన్యుల విన్నపాలను సైతం పరిగణనలోకి తీసుకుని, క్షేత్రస్థాయి పరిస్థితులపై పీఎంవో స్పందించడం గొప్ప మార్పుకు సంకేతమని ఆయన హర్షం వ్యక్తం చేశారు.