తొమ్మిది అంతస్తులెక్కి దిగలేకపోతున్నం.. రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ ఆఫీసు ఎదుట ఫ్లాట్ ఓనర్స్ ధర్నా

తొమ్మిది అంతస్తులెక్కి దిగలేకపోతున్నం.. రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ ఆఫీసు ఎదుట ఫ్లాట్ ఓనర్స్ ధర్నా
  • పోచారం సద్భావన టౌన్‌‌షిప్​లో పెండింగ్ పనులు పూర్తి చేయాలి

బషీర్​బాగ్, వెలుగు: పోచారం సద్భావన టౌన్‌‌షిప్ లోని రాజీవ్ స్వగృహలో పెండింగ్ పనులన్నీ పూర్తి చేసి తమకు అప్పగించాలని ఫ్లాట్ ఓనర్స్ డిమాండ్ చేశారు.. హిమాయత్ నగర్ లోని రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ ఆఫీసు ఎదుట సోమవారం ధర్నా నిర్వహించారు. పేద, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన తాము బ్యాంక్ లోన్లు తీసుకొని 2500 ఎస్ఎఫ్టీ ఫ్లాటును రూ.20 లక్షలు వెచ్చించి కొనుగోలు చేశామన్నారు. అన్ని వసతులు పూర్తి చేసి చేతికి తాళాలు ఇస్తామని చెప్పి ప్రభుత్వం తమను మోసం చేసిందన్నారు. 

ఎంతోమంది వృద్ధులు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారని, వారంతా లిఫ్టులు పని చేయక తొమ్మిది అంతస్తులు ఎక్కి దిగలేక ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. తక్షణమే అసోసియేషన్ ఏర్పాటు చేసి, అమ్ముడుపోని ఫ్లాట్లకు టీజీఆర్సీఎల్ నుంచి నిర్వహణ చార్జీలు ఇవ్వాలన్నారు. 

అలాగే లిఫ్ట్, ఎస్టీపీ, హౌస్ కీపింగ్, నీటి బిల్లుల నిర్వహణ, వాటర్ టెర్రస్ ప్రూఫింగ్ తో పాటు అన్ని టవర్లకు పెయింట్ వేయాలన్నారు. సొసైటీ ఏర్పడిన తర్వాత అపెక్స్ ఖాతాలో డెవలప్‌‌మెంట్ ఫండ్, కార్పస్ ఫండ్ డిపాజిట్ కోసం టీజీఆర్సీఎల్ నుంచి హామీ ఇవ్వాలన్నారు. ఫ్లాట్ ఓనర్స్ రామకృష్ణ,  లజురస్ జూపాక , వెంకట నారాయణ , శ్రీని బాలాజీ, గోపాల్, సాయికిరణ్ , మహేశ్ పాల్గొన్నారు.