V6 News

అద్వానీ నేషనల్ హీరో .. ప్రముఖుల హర్షం

అద్వానీ నేషనల్ హీరో .. ప్రముఖుల హర్షం

న్యూఢిల్లీ: ఎల్ కే అద్వానీకి భారత రత్న ప్రకటించడం పట్ల కేంద్ర మంత్రులు, బీజేపీ సహా వివిధ పార్టీల నేతలు, ప్రముఖులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు. ఆయనకు అభినందనలు తెలుపుతూ సోషల్ మీడియాలో సందేశాలు పోస్ట్ చేశారు. అద్వానీకి ఈ అవార్డు సముచిత గౌరవమని, జీవితాన్ని దేశానికి అంకితం చేసిన ‘నేషనల్ హీరో’ ఆయన అని కొనియాడారు. అద్వానీ ప్రజలకు నిస్వార్థంగా సేవలు అందించారని కేంద్ర హోం మంత్రి అమిత్ షా కొనియాడారు. 

New Delhi,దేశం, సంస్కృతి, ప్రజల కోసం ఆయన అలుపులేని కృషి చేశారన్నారు. బీజేపీ, దాని సిద్ధాంతం కోసం ఆయన చేసిన కృషిని మాటల్లో చెప్పలేమన్నారు. దేశంలోని కురువృద్ధ రాజనీతిజ్ఞులలో అద్వానీ అగ్రగణ్యుడని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ అన్నారు. దేశ అభివృద్ధి పథంలో ఆయన చెరగని ముద్ర వేశారన్నారు.  రాజకీయాల్లో నైతికతకు, అంకితభావానికి, దృఢమైన సంకల్పానికి అద్వానీ ఒక ప్రతీకగా నిలుస్తారని రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ అన్నారు. దేశ నిర్మాణంలో ఆయన కృషి ఎలప్పుడూ స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందన్నారు.