- క్వార్టర్స్‌లోనే ఓడిన రోజర్
- సెమీస్‌లో జొకోవిచ్, షపలోవ్
లండన్: వింబుల్డన్‌లో మరో సంచలనం. కెరీర్‌లో 21వ గ్రాండ్‌స్లామ్ వేటలో ఉన్న స్విట్జర్లాండ్ సూపర్ స్టార్ రోజర్ ఫెడరర్‌కు చుక్కెదురైంది. బుధవారం జరిగిన మెన్స్ సింగిల్స్ క్వార్టర్‌ఫైనల్లో14వ సీడ్ హుబెర్ట్ హుర్కాజ్ (పోలెండ్) 6–3, 7–6 (7/4), 6–0తో ఆరోసీడ్ ఫెడరర్‌పై సంచలన విజయం సాధించాడు. కెరీర్‌లో ఫస్ట్‌టైమ్ గ్రాండ్‌స్లామ్ క్వార్టర్స్ ఆడిన పోలెండ్ ప్లేయర్.. గంటా 49 నిమిషాల్లోనే స్విస్ ప్లేయర్‌కు చెక్ పెట్టాడు. దీంతో తొమ్మిదోసారి వింబుల్డన్ గెలిచి మార్టినా నవ్రతిలోవాతో సమంగా నిలవాలన్న ఫెడెక్స్ఆశ నెరవేరలేదు. ఓవరాల్ కెరీర్‌లో రోజర్ గ్రాండ్‌స్లామ్ క్వార్టర్స్‌లో ఓడిపోవడం ఇది ఐదోసారి (మూడుసార్లు క్లే కోర్టు, రెండు గ్రాస్ కోర్టు). ఈ మ్యాచ్ మొత్తం ఆధిపత్యం కొనసాగించిన హుర్కాజ్.. బలమైన సర్వీస్, అద్భుతమైన రిటర్న్ షాట్స్‌తో ఆకట్టుకున్నాడు. మ్యాచ్ మొత్తంలో హుర్కాజ్ 10 ఏస్‌లు సంధిస్తే, ఫెడరర్ ఐదుకే పరిమితమయ్యాడు. ఇద్దరు చెరో మూడు డబుల్ ఫాల్ట్స్ చేశారు. అయితే స్విస్ లెజెండ్ 31 అనవసర తప్పిదాలు చేసి మూల్యం చెల్లించుకున్నాడు. నాలుగు బ్రేక్ పాయింట్లలో ఒకే ఒక్కదానిని సద్వినియోగం చేసుకున్నాడు. మరో క్వార్టర్స్ మ్యాచ్‌లో టాప్‌సీడ్ నొవాక్ జొకోవిచ్ (సెర్బియా) 6–3, 6–4, 6–4తో మార్టన్ పుక్సోవిక్స్ (హంగేరి)పై గెలిచాడు. దీంతో 10వసారి వింబుల్డన్ సెమీస్‌లోకి అడుగుపెట్టాడు. ఓవరాల్‌గా జొకోకు 41వ గ్రాండ్‌స్లామ్ సెమీస్ కావడం విశేషం. గ్రాస్ కోర్టుపై ఇది 100వ విజయం. మరో మ్యాచ్‌లో పదోసీడ్ డెనిస్ షపలోవ్ (కెనడా) 6–4, 3–6, 5–7, 6–1, 6–4తో 25వ సీడ్ కచనోవ్ (రష్యా)పై గెలిచి సెమీస్‌కు దూసుకుపోయాడు.
సానియా–బోపన్న ఇంటికి
వింబుల్డన్‌ల ఇండియా పోరాటం ముగిసింది. మిక్స్‌డ్ డబుల్స్‌లో సానియా మీర్జా–రోహన్ బోపన్న ప్రి క్వార్టర్స్‌లోనే ఇంటిదారి పట్టారు. హోరాహోరీగా సాగిన పోరులో సానియా–బోపన్న జోడీ 3–6, 6–3, 9–11తో 14వ సీడ్ ఆండ్రెజా క్లెపాచ్ (స్లొవేనియా)–జులియెన్ రోజర్-(నెదర్లాండ్స్) ద్వయం చేతిలో ఓడింది. మంగళవారమే మొదలైన ఈ మ్యాచ్ ఫస్ట్ సెట్ తర్వాత వర్షంతో ఆగిపోయింది. ఆ సెట్‌ను ఇండియా జంట కోల్పోయింది. బుధవారం తిరిగి ఆట మొదలవగా.. సెకండ్ సెట్ గెలిచిన మీర్జా–బోపన్న మ్యాచ్‌లో నిలిచింది. కానీ, అదే జోరును కొనసాగించలేకపోయింది. బోపన్న పదునైన సర్వీస్, నెట్ గేమ్‌తో అదరగొట్టినా.. సానియా మాత్రం సర్వీస్‌లో చాలా ఇబ్బంది పడింది. అయినా 20వ గేమ్ వరకూ ఇండియన్ ప్లేయర్లు గట్టిపోటీనే ఇచ్చినా మ్యాచ్ నెగ్గలేకపోయారు. టోక్యో ఒలింపిక్స్‌కు ముందు సానియాకు ఇదే చివరి టోర్నీ కావడం గమనార్హం.

