పద్మారావునగర్, వెలుగు: బైకర్ల ప్రాణాలను రక్షించేందుకు మల్కాజిగిరి పోలీసు కమిషనరేట్ ట్రాఫిక్ పోలీసులు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. సోమవారం సికింద్రాబాద్‌లోని సంగీత్ చౌరస్తా వద్ద ‘హెల్మెట్ బ్యాంక్’ ప్రారంభించారు.
హెల్మెట్ లేకుండా పట్టుబడిన వాహనదారులకు జరిమానా వేయడానికి బదులు, వారి వివరాలు నమోదు చేసుకుని ఉచితంగా హెల్మెట్‌ను ఇక్కడ అప్పుగా అందజేస్తారు. అయితే, బాధితులు 24 గంటల్లోపు సొంతంగా కొత్త హెల్మెట్ కొనుగోలు చేసి, పోలీసుల వద్ద తీసుకున్న హెల్మెట్‌ను తిరిగి అప్పగించాల్సి ఉంటుంది.
రోడ్డు ప్రమాదాల్లో హెల్మెట్ లేకపోవడం వల్లే అత్యధిక మరణాలు సంభవిస్తున్నాయని ట్రాఫిక్ డీసీపీ-1 రాహుల్ రెడ్డి తెలిపారు. కేవలం చలాన్ల కోసమే కాకుండా బాధ్యతాయుత ప్రయాణంపై అవగాహన కల్పించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేశారు. త్వరలోనే బేగంపేటలోనూ మరో హెల్మెట్ బ్యాంక్‌ను ఏర్పాటు చేస్తామన్నారు.
