సాగర్ పోలింగ్ సరళిపై పార్టీల కుస్తీ 

సాగర్ పోలింగ్ సరళిపై పార్టీల కుస్తీ 
  • ఎవరి లెక్కలు వాళ్లవే
  • 86.18 శాతం భారీ పోలింగ్‌తో అంచనాలపై ఉత్కంఠ
  • 2018 ఎన్నికలతో పోలిస్తే 0.28 శాతం తక్కువ
  • బూత్ ల వారీగా పడ్డ ఓట్లపై పార్టీల కసరత్తు

నల్గొండ, వెలుగు: ఉత్కంఠభరితంగా సాగిన నాగార్జునసాగర్​ఉప ఎన్నికలో గెలుపుపై ప్రధాన రాజకీయ పార్టీలన్నీ లెక్కలేసుకుంటున్నాయి. అభివృద్ధితోపాటు, భారీస్థాయిలో ప్రలోభాలకు గురిచేసిన అధికార పార్టీ గెలుపు తమదేనన్న విశ్వాసం వ్యక్తం చేస్తోంది. అదే క్రమంలో కాంగ్రెస్​ పార్టీ సైతం ప్రభుత్వ వ్యతిరేకత, జానారెడ్డి ఇమేజ్​పైనే ఆశలు పెట్టుకుంది. ఈ ఎన్నికల్లో సత్తా చాటుకునేందుకు బీజేపీ ఎస్టీ సామాజిక వర్గంపైనే ఫోకస్​ పెట్టింది. ప్రధాన పోటీ రెండు పార్టీల మధ్యనే జరిగినప్పటికీ, బీజేపీ ప్రభావం ఏ పార్టీపై పడుతుందనేది ఆసక్తికరంగా మారింది. పైగా 2018 ఎన్నికలతో పోలిస్తే పోలింగ్​ పర్సంటేజీ కూడా పెరగలేదు. చాలా స్వల్పంగా తగ్గింది. ఇప్పుడు జరిగిన బై ఎలక్షన్లో 2,20,206 మంది ఓటర్లు ఉండగా, 1,89,782 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. పోలింగ్​ 86.18 శాతం నమోదైంది. 2018 అసెంబ్లీ ఎ న్నికల్లో 2,08,176 మంది ఓ టర్లు కాగా, 1,79,995 ఓట్లు పోలయ్యాయి. పోలింగ్​ 86.46 శాతం నమోదైంది. 2018తో పోలిస్తే ప్రస్తుతం పోలింగ్​పర్సంటేజీ 0.28 శాతం మాత్రమే తగ్గింది. అయితే అప్పడు జరిగిన ఎన్నికలో టీఆర్ఎస్, కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ అభ్యర్థులతో కలిపి 14 మంది పోటీలో ఉన్నారు. కానీ ఇప్పుడు ప్రధాన పార్టీలతో కలిపి 41 మంది పోటీచేశారు. దీంతో ఓట్ల చీలిక ఏ పార్టీపై ప్రభావం చూపుతుందన్న దాని గురించే చర్చ జరుగుతోంది.
బూత్​ల వారీగా లెక్కలు
మండల, గ్రామ స్థాయిలో పోలింగ్​ బూత్​ల వారీగా ఎన్ని ఓట్లు పోలయ్యాయి? ఏ గ్రామం తమకు అనుకూలంగా ఉంది? ఏ పోలింగ్​ బూత్​లో ఎన్ని ఓట్లు పడ్డాయనే దానిపై పార్టీలు విశ్లేషిస్తున్నాయి. బైపోల్​లో పార్టీలు తమ ఉద్దేశాన్ని ఓటర్లకు వివరించడంతోపాటు, భారీ స్థాయిలో ప్రలోభాలకు గురిచేశాయి. అయితే ఆ ప్రలోభాలు ఎక్కడ, ఏ విధంగా పనిచేశాయనే దాని మీద లెక్కలు వేస్తున్నారు. ఎక్కడ తమకు అనుకూలంగా ఓటింగ్​జరిగింది. ఎక్కడ ఇబ్బంది కలిగింది. ఏ కులాలు ఎటువైపు మొగ్గు చూపాయి, దీనికి కారణాలు.. ఇలా పలు కోణాల్లో గెలుపోటముల గురించి విశ్లేషణ చేస్తున్నారు. గుర్రంపోడు మండలంలో ఎస్టీలు బీజేపీకి మొగ్గు చూపడంతో టీఆర్ఎస్​కు నష్టం జరుగుతుందనే అంచనాతో కాంగ్రెస్​ పార్టీ వాళ్లు ఉన్నారు. అదేవిధంగా హాలియా పట్టణంలో టీఆర్ఎస్, కాంగ్రెస్​ రెండు పార్టీలు దీటుగా డబ్బులు పంచిపెట్టాయి. ఈ నేపథ్యంలో ప్రలోభాలు ఎంతవరకు పని చేశాయన్నదానిపై అభ్యర్థుల్లో చర్చలు జరుగుతున్నాయి. 
సైలెంట్​ ఓటింగ్..​ 
పోలింగ్​పర్సంటేజీని బట్టి చూస్తే పంచాయతీ ఎన్నికల తరహాలో పోలింగ్​ జరిగిందని ఎన్నికల ఆఫీసర్లు చెప్తున్నారు. ఏడు మండలాల్లో కూడా 77 శాతం నుంచి 93 శాతం వరకు ఓట్లు పోలయ్యాయి. మెజార్టీ ఓటర్లు తమవైపే ఉన్నారని టీఆర్ఎస్​ నమ్మకంతో ఉంది. కానీ సైలెంట్​ఓటింగ్​జరిగిందని కాంగ్రెస్​అంచనా వేస్తోంది. పోలింగ్​కేంద్రాల్లో మూడేసి ఈవీఎంలు ఉండటం, ఈవీఎంలో ఐదో సింబల్​ట్రక్కు గుర్తు ఉండటం, 37 మంది ఇండిపెండెంట్లు పోటీలో ఉండటం వంటి అంశాలు తమకు కలిసొస్తాయనే ధీమాతో ఉన్నారు. రెండు పార్టీల దగ్గర డబ్బులు తీసుకున్న ఓటర్లు చాలా వరకు క్రాస్​ ఓటింగ్​పాల్పడ్డారని చెప్తున్నారు. దీని వల్ల కొంతమేర టీఆర్ఎస్​కు నష్టం జరిగే ఆస్కారం ఉన్నప్పటికీ ఆ ప్రభావం మెజార్టీపైనే చూపుతుంది తప్ప గెలుపోటములు డిసైడ్​చేయదని ఆ పార్టీ సీనియర్​లీడర్​ఒకరు చెప్పారు. ఎస్టీ ఓటర్ల పైనే ఫుల్​ఫోకస్​పెట్టిన బీజేపీ ఏ మేరకు ఓటు బ్యాంకు సాధిస్తుందనే దాని గురించి కూడా పార్టీ లీడర్లు మండలాల వారీగా లెక్కలు తీస్తున్నారు. బీజేపీ చీల్చే ఓట్లు రెండు పార్టీల్లో దేనిపైన ప్రభావం చూపుతుందనేది దాని గురించి కూడా చర్చ జరుగుతోంది.