ఫిబ్రవరి 5 నుంచి పాలిటెక్నిక్ లెక్చరర్ల స్కూల్ బాట : టెక్నికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్ మెంట్

ఫిబ్రవరి 5 నుంచి పాలిటెక్నిక్ లెక్చరర్ల  స్కూల్ బాట : టెక్నికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్ మెంట్
  •     టెన్త్ స్టూడెంట్లకు కోర్సులపై అవగాహన కల్పించేలా ప్లాన్ 
  •     కాలేజీల్లో ప్రత్యేక టీమ్​ల ఏర్పాటు 

హైదరాబాద్, వెలుగు: టెన్త్ తర్వాత ఇంజనీరింగ్ వైపు వెళ్లాలనుకునే విద్యార్థులను పాలిటెక్నిక్ వైపు ఆకర్షించేందుకు టెక్నికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్ మెంట్ ఫోకస్ పెట్టింది. దీంట్లో భాగంగా గురువారం నుంచి పాలిటెక్నిక్ లెక్చరర్లు ‘స్కూల్ బాట’ పట్టనున్నారు. సర్కారు, ప్రైవేటు హైస్కూళ్లలో పదో తరగతి విద్యార్థులకు పాలిటెక్నిక్ కోర్సుల ప్రాధాన్యతను వివరించి, వారిలో అవగాహన కల్పించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. 

ఈ నెల2వ తేదీ నుంచే పాలిసెట్ దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం కావడంతో, అడ్మిషన్ల సంఖ్యను పెంచుకునేందుకు అధికారులు ఇప్పటి నుంచే గ్రౌండ్ వర్క్ మొదలుపెట్టారు. ఇటీవల గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజీల ప్రిన్సిపాల్స్ తో టెక్నికల్ ఎడ్యుకేషన్ కమిషనర్ శ్రీదేవసేన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పాలిటెక్నిక్ లో కొత్త కోర్సులు వస్తున్నాయని, సీట్లు పెరగుతాయని... కాబట్టి అడ్మిషన్ల పెంపుపై దృష్టి సారించాలని ఆదేశించారు. 

ఈ క్రమంలోనే స్కూళ్ల బాట పట్టాలని సూచించారు. దీనికి అనుగుణంగా అన్ని సర్కారు ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీల్లో లెక్చరర్లతో కూడిన ప్రత్యేక టీమ్​లను ఏర్పాటు చేశారు. ఈ బృందాలు తమ పరిధిలోని హైస్కూళ్లను సందర్శిస్తాయి. కేవలం ప్రభుత్వ స్కూళ్లే కాకుండా, ప్రైవేటు స్కూళ్లకు కూడా వెళ్లి అక్కడ టెన్త్ చదువుతున్న పిల్లలతో మాట్లాడతారు. పాలిటెక్నిక్ లో  అందుబాటులోని కోర్సులు, ఏ కోర్సులు చేస్తే ఏం లాభాలు, ఉద్యోగ, ఉపాధి అవకాశాల గురించి విద్యార్థులకు వివరించనున్నారు. 

నోటీసు బోర్డులపై పోస్టర్లు

ప్రతిరోజూ స్కూళ్లలో కన్పించేలా ప్రతి స్కూల్ నోటీసు బోర్డుపై పాలిటెక్నిక్ కోర్సుల వివరాలతో కూడిన పోస్టర్లను అంటించాలని నిర్ణయించారు. పాలిసెట్ ఎగ్జామ్ తేదీలు, దరఖాస్తు విధానం, సిలబస్, తదితర వివరాలను ఈ పోస్టర్లలో పొందుపర్చారు. డిప్లొమా ఇన్ ఇంజినీరింగ్, నాన్-ఇంజనీరింగ్ కోర్సులకు ఉన్న డిమాండ్‌ను వివరించి, విద్యార్థులు పాలిసెట్ రాసేలా ప్రోత్సహించనున్నారు.