రవాణాశాఖ ఆదాయం పెంచాలి: మంత్రి పొన్నం

రవాణాశాఖ ఆదాయం పెంచాలి: మంత్రి పొన్నం
  • అధికారులతో సమీక్షా సమావేశం

హైదరాబాద్, వెలుగు: ప్రజలకు, వాహనాదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా రాష్ట్రంలో రవాణా శాఖ ఆదాయాన్ని పెంచాలని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులను ఆదేశించారు. మంగళవారం సెక్రటేరియట్ లో రవాణా శాఖ ఉన్నతాధికారులతో పాటు అన్ని జిల్లాల అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. గత ఏడాది, ప్రస్తుత ఏడాది జిల్లాల వారీగా వచ్చిన ఆదాయాన్ని పరిశీలిస్తూ ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను ఏ జిల్లాలు అధిగమించాయో, ఏ జిల్లాలు చేరుకోలేకపోయాయో అన్న అంశంపై మంత్రి సమీక్షించారు. లక్ష్యాలను సాధించిన అధికారులను అభినందించారు. వెనుకబడిన జిల్లాల అధికారులు పనితీరును మెరుగుపరుచుకోవాలని సూచించారు. ‘సారథి’ కేంద్ర పోర్టల్‌‌కు తెలంగాణ రవాణా శాఖను అనుసంధానం చేసిన ఎనిమిది నెలల్లోనే దేశంలో ప్రథమ స్థానంలో నిలిచామని మంత్రి తెలిపారు. 

అదే ఉత్సాహంతో ‘వాహన్’ పోర్టల్ డేటాను పూర్తిచేసి సాంకేతిక సమస్యలు తలెత్తకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. జూన్‌‌ 1 నుంచి రాష్ట్రంలో ఆటోమేటిక్ టెస్టింగ్ స్టేషన్లు ప్రారంభించేలా పనులు వేగవంతం చేయాలని కోరారు. ఏఎంవీఐలకు ఇచ్చినట్లే ఇతర రవాణా శాఖ అధికారులకు కూడా శిక్షణ ఇవ్వాలని చెప్పారు. రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాల మరణాలను తగ్గించేందుకు ‘రహవీర్’ పథకం, క్యాష్‌‌లెస్ చికిత్సపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు. 17 జిల్లాల్లో రవాణా శాఖ కార్యాలయాలకు స్థలాలు గుర్తించడం, ‘అరైవ్-అలైవ్’ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు.