- బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావును ప్రశ్నించిన మంత్రి పొన్నం
హైదరాబాద్, వెలుగు: తెలంగాణ ప్రజలు పన్నులు చెల్లించకుండా కేంద్ర ప్రభుత్వం ఎలా నడుస్తుందో రాష్ట్ర బీజేపీ నేతలు చెప్పాలని మంత్రి పొన్నం ప్రభాకర్సవాల్ విసిరారు. ప్రతి స్కీమ్‌లో కేంద్రం వాటా ఉందని చెప్పడం బీజేపీ నేతలకు అలవాటుగా మారిందని, రాష్ట్ర ప్రజలు చెల్లించే పన్నుల్లో కొంత వాటా వెనక్కి ఇస్తే అది కేంద్రం ఇచ్చినట్టు ఎలా అవుతుందని నిలదీశారు.
మంగళవారం ఆయన హైదరాబాద్‌లో మీడియాకు ఒక ప్రకటన విడుదల చేశారు. ఇండ్ల నిర్మాణ పథకంలో కేంద్రం నిధులు ఉన్నాయని వాదిస్తున్న బీజేపీ నేతలకు తెలంగాణపై ఏమాత్రం ప్రేమ ఉన్నా, కేంద్రం నుంచి రాష్ట్రానికి అదనపు నిధులు తీసుకురావాలని సవాల్ చేశారు. ఆ నిధులతో జీహెచ్‌ఎంసీ పరిధిలో మరికొంతమంది పేదలకు ఇండ్లు నిర్మించి ఇవ్వవచ్చని పేర్కొన్నారు.
పేదలకు ఇండ్లు అందించే పథకాన్ని రాజకీయ కోణంలో కాకుండా ప్రజా సంక్షేమ దృక్పథంతో చూడాలని మంత్రి హితవు పలికారు. ఏ చట్టసభలోనూ సభ్యుడు కాని ఆయన రాజకీయ ఉనికి కాపాడుకోవడానికే రాష్ట్ర ప్రభుత్వంపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.
