V6 News

ఆర్టీసీ విలీనంపై అధ్యయనం జరగాల్సి ఉంది : మంత్రి పొన్నం

ఆర్టీసీ విలీనంపై అధ్యయనం జరగాల్సి ఉంది : మంత్రి పొన్నం
  • దీనిపై గత ప్రభుత్వమే కమిటీ వేసింది
  • అన్ని అంశాలపై స్టడీ నివేదిక ఆధారంగానే విలీనంపై ముందుకెళ్తాం: మంత్రి పొన్నం
  • సమ్మె నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కార్మికులకు విజ్ఞప్తి 

హైదరాబాద్, వెలుగు: ఆర్టీసీ విలీనంపై గత ప్రభుత్వమే కమిటీ వేసిందని రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. మంగళవారం ఆయన హైదరాబాద్ లో మీడియాకు ఒక ప్రకటన విడుదల చేశారు. ఆర్టీసీ విలీనంపై కమిటీ ఎవరితో వేశారో, ఎక్కడ ఉందో చెప్పాలని ఇటీవల ఆర్టీసీ జేఏసీ నేతలు మంత్రిని ప్రశ్నించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు మంగళవారం పొన్నం వివరణ ఇచ్చారు. ‘ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడానికి సంబంధించి 2023 సెప్టెంబర్ 9 న గత బీఆర్ఎస్ ప్రభుత్వం కమిటీ ఏర్పాటు చేసింది.

దీనికి ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి చైర్మన్ గా, కార్మిక, రవాణా శాఖ ముఖ్య కార్యదర్శులు, జీఏడీ కార్యదర్శి, ఆర్టీసీ ఎండీ  కమిటీ సభ్యులుగా ఉన్నారు. కానీ కమిటీ ఏర్పాటైన 10 రోజులకే అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది’ అని మంత్రి గుర్తు చేశారు. 

ఆర్టీసీ విలీనంపై కమిటీ పూర్తి స్థాయిలో అధ్యయనం చేయాల్సి ఉందని.. ఆర్థిక పరిస్థితులు, ఉద్యోగుల, సంస్థ ప్రయోజనాలను పరిగణనలోకి తీసుకొని ఈ కమిటీ సమగ్ర నివేదిక ఇవ్వాల్సి ఉందన్నారు. ఇక గుర్తింపు కార్మిక సంఘానికి ఎన్నికల అంశం కూడా ప్రభుత్వ పరిధిలో ఉందన్నారు. ఈ రెండు అంశాలు తప్ప ఆర్టీసీ కార్మికులు, ఉద్యోగులకు సంబంధించిన మిగిలిన అన్ని సమస్యలపై చర్చించేందుకు  తాను సిద్ధమన్నారు. సంస్థ పరిరక్షణ కోసం, ఉద్యోగుల సంక్షేమం కోసం సమ్మె నోటీస్​ వెనక్కి తీసుకోవాలని జేఏసీ నేతలను మంత్రి కోరారు. 

రోడ్డు భద్రతపై ప్రతిజ్ఞ చేసిన మంత్రి పొన్నం

అరైవ్..అలైవ్ కార్యక్రమంలో భాగంగా ఖైరతాబాద్ ఆర్టీఏ ఆఫీసులో మంగళవారం ఆర్టీఏ, ఆర్టీసీ అధికారులతో కలిసి మంత్రి పొన్నం ప్రభాకర్ రోడ్డు ప్రమాదాల నివారణపై ప్రతిజ్ఞ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ..వాహనదారులకు సరిపడా ఉద్యోగులను ఏర్పాటు చేయడం సాధ్యం కాదని, ప్రజలు దీన్ని దృష్టిలో ఉంచుకొని రోడ్డు భద్రతా అనేది ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాదని, ప్రజల బాధ్యత అని ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాలని కోరారు. రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారికి సహాయం చేస్తే రూ. 25 వేలు ఇస్తున్నామని చెప్పారు. బాధితులకు గోల్డెన్ అవర్ లో సహాయ పడితే వారిని ప్రాణాల నుంచి కాపాడవచ్చని పేర్కొన్నారు