రెండునెల్ల పసికూనపైననా.. మీ దాడి : పొన్నం

రెండునెల్ల పసికూనపైననా..  మీ దాడి : పొన్నం
  •  బెంజి కార్లలో తిరిగినోళ్లు అసెంబ్లీకి ఆటోల్లో వస్తున్నారు 
  • కాంగ్రెస్ ప్రభుత్వానికి రూ.8 లక్షల కోట్ల అప్పు ఇచ్చిపోయారు 
  • పదేండ్లలో లక్ష్మీదేవిపల్లి ప్రాజెక్టు ఎందుకు చేపట్టలేదు 
  • పాలమూరు న్యాయ యాత్రలో బీఆర్ఎస్ పై మంత్రి ఫైర్​

షాద్ నగర్, వెలుగు:  ప్రభుత్వం ఏర్పడి రెండు నెలలు మాత్రమే అయిందని.. పసికూన లాంటి ప్రభుత్వంపై బీఆర్ఎస్ డ్రామా కంపెనీ అప్పుడే అరుపులు పెడబొబ్బలు మొదలుపెట్టిందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ప్రజా పాలన చూసి ఓర్వలేక పోతున్నదని ఫైర్ అయ్యారు. సీడబ్ల్యూసీ సభ్యుడు చల్లా వంశీచంద్ రెడ్డి చేపట్టిన పాలమూరు న్యాయయాత్ర ఆదివారం రంగారెడ్డి జిల్లా కొత్తూరు, నందిగామ మండలాల్లో కొనసాగింది. ఈ యాత్రలో మంత్రి పొన్నం ప్రభాకర్​ ముఖ్య​అతిథిగా పాల్గొని మాట్లాడారు.  

కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీల అమలుకు ప్రత్యేక ప్రణాళిక రూపొందించిందన్నారు. రెండు నెలల్లోనే మహిళల ఫ్రీ జర్నీల సంఖ్య 16 కోట్లు దాటిందన్నారు. గత ప్రభుత్వం ఆర్టీసీ సంస్థ, కార్మికుల గురించి పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. ఆర్టీసీ కార్మికులకు పీఆర్సీ ఇచ్చే అంశం పరిశీలిస్తున్నామని చెప్పారు. రూ.280 కోట్ల బకాయిలను విడుదల చేసినట్లు గుర్తు చేశారు. బెంజ్ కార్లలో తిరిగే బీఆర్ఎస్ నాయకులు అసెంబ్లీకి ఆటోల్లో వస్తున్నారని ఎద్దేవా చేశారు. ఆటో కార్మికులను రెచ్చగొట్టి రాజకీయంగా వాడుకునే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. 

మాజీ సీఎం కేసీఆర్ రూ.8లక్షల కోట్ల అప్పులు చేసి కొత్తగా ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం నెత్తిన పెట్టిపోయారని ఆరోపించారు. షాద్ నగర్ నియోజకవర్గంలో లక్ష్మీదేవిపల్లి ప్రాజెక్టును గత పదేండ్లలో సీఎంగా ఉన్న కేసీఆర్ ఎందుకు చేపట్టలేదని ప్రశ్నించారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందని ఢిల్లీలో కూడా వస్తే మాది డబుల్ ఇంజిన్ సర్కార్ అవుతుందని.. బీజేపీ ఆశలు గల్లంతు అవుతాయని అన్నారు. తెలంగాణకు బీజేపీ అధ్యక్షుడు ఎవరు ఉండాలో కూడా కేసీఆర్ డిసైడ్ చేస్తారని కేసీఆర్, కిషన్ రెడ్డి ఇద్దరు ఒకటేనని  ఆరోపించారు. యాత్రలో కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి, మాజీ ఎమ్మెల్యే ప్రతాప్​రెడ్డి పాల్గొన్నారు.