ఫోన్లు దొర్కుతలేవ్‌‌

ఫోన్లు దొర్కుతలేవ్‌‌
  • విపరీతంగా తగ్గిన సప్లయ్‌లు

న్యూఢిల్లీ: పాపులర్ బ్రాండ్ల స్మార్ట్‌‌ఫోన్ల సప్లయ్‌ ఎన్నడూ లేనంతగా తగ్గుతున్నాయి. గిరాకీ ఉన్నంతగా స్టాకులు ఉండటం లేదు. షావోమీ, శామ్‌‌సంగ్‌‌, యాపిల్‌‌, రియల్‌‌మీ సహా పలు ప్రముఖ బ్రాండ్లకు చెందిన ఫేమస్‌ స్మార్ట్‌‌ఫోన్ మోడల్స్‌‌ స్టాకులు దాదాపు నిండుకున్నాయి. కొన్ని మోడల్స్‌‌ సప్లయ్‌లు ఆల్‌‌ టైం కనిష్టానికి చేరుకున్నాయి. డిమాండ్‌‌తో పోలిస్తే సప్లయ్‌ 30 శాతం వరకు తక్కువగా ఉంది. ఫెస్టివల్‌‌ సీజన్‌‌ కోసం కంపెనీలు  ఏదోవిధంగా  స్టాకులను సర్దుబాటు చేశాయని, ఇప్పుడు ఆన్‌‌లైన్‌‌తోపాటు ఆఫ్‌‌లైన్‌‌లోనూ సప్లయ్‌లు చాలా తగ్గాయని మార్కెట్‌‌ రీసెర్చర్లు ఐడీసీ, కౌంటర్ పాయింట్‌‌ రీసెర్చ్‌‌లు తెలిపాయి. డిసెంబరు క్వార్టర్‌‌లో అమ్మకాలు ఇంకా తగ్గుతాయని స్పష్టం చేశాయి. స్టాకులు ఎప్పుడు పంపిస్తారనే విషయమై కంపెనీలు ఏమీ చెప్పడం లేదని సౌత్‌‌ ఇండియాలో సెల్‌‌ఫోన్‌‌ రిటైల్‌‌ చెయిన్‌‌ ఫౌండర్​ ఒకరు అన్నారు. 

చిప్స్‌‌ దొరక్కపోవడం వల్లే..

ప్రపంచవ్యాప్తంగా సెమికండక్టర్ల కొరత ఉండటమే ప్రస్తుత కొరతకు కారణమని కంపెనీలు చెబుతున్నాయి. ఉన్న కాస్త స్టాకును కూడా చిప్‌‌ కంపెనీలు యూరప్ వంటి దేశాలకు తరలిస్తుండటంతో ఆసియాకు ఫోన్ల రాక తగ్గింది. ‘‘ఇక్కడ ఫెస్టివల్‌‌ సీజన్ అయిపోయింది. వెస్టర్న్‌‌ కంట్రీస్‌‌లో క్రిస్మస్‌‌ సందడి మొదలైంది. అందుకే చిప్స్‌‌ అక్కడికి వెళ్తున్నాయి’’ అని ఆయన చెప్పారు. ఈ విషయమై షావోమీ, శామ్‌‌సంగ్‌‌, యాపిల్‌‌, రియల్‌‌మీలకు పంపిన ఈ–మెయిల్స్‌‌కు జవాబు రాలేదు. ‘‘మనదేశంలో దీపావళి తరువాత ఫోన్లకు డిమాండ్ 40 శాతం తగ్గుతుంది. ఈసారి డిమాండ్‌‌ తగ్గినా, సరిపడా స్టాక్ కూడా లేదు. స్టాక్‌ మొత్తం అమ్ముడయ్యింది. డిసెంబరు వరకు ఇదే పరిస్థితి ఉండొచ్చని అనుకుంటున్నాం. కొత్త సంవత్సరం నుంచే కంపెనీలు ఇండియాకు స్టాక్స్‌‌ను పంపిస్తాయి’’ అని కౌంటర్ పాయింట్‌‌ తరుణ్‌‌ పాఠక్‌‌ చెప్పారు. ఎంట్రీ లెవెల్‌‌ నుంచి రూ.20 వేలలోపు ఫోన్లకు కొరత ఎక్కువగా ఉంది. ఐఫోన్లలో చాలా మోడల్స్‌‌ అందుబాటులో లేవు.   రెడ్‌‌మీ నోట్‌‌ 10 ప్రొ, రెడ్‌‌మీ నోట్‌‌ 10 ప్రొ మ్యాక్స్‌‌, రెడ్‌‌మీ 10 ప్రైమ్‌‌, రెడ్‌‌మీ నోట్‌‌ 10 టీ 5జీ, ఎంఐ 10ఐ వంటి  మోడల్స్‌‌ స్టాక్‌‌ అయిపోయింది.  కొన్నిచోట్ల పరిమితంగా స్టాక్‌‌లు అందుబాటులో ఉన్నాయి.  శామ్‌‌సంగ్ ఎం, ఎస్‌‌ సిరీస్‌‌ ఫోన్ల పరిస్థితీ ఇలాగే ఉందని స్మార్ట్ ఫోన్ రిటైల్‌ చెయిన్‌లు చెబుతున్నాయి.

ఫోన్లపై జీఎస్టీని 12 శాతానికి తగ్గించండి

మొబైల్‌‌ఫోన్లపై జీఎస్టీని 12 శాతానికి, స్పేర్‌‌పార్టులపై జీఎస్టీని ఐదుశాతానికి తగ్గించాలని మొబైల్  అండ్‌‌ ఎలక్ట్రానిక్స్ బాడీ, ఇండియా సెల్యులార్ & ఎలక్ట్రానిక్స్ అసోసియేషన్ (ఐసియా) కోరింది. అధిక జీఎస్టీ రేట్ల వల్ల డిజిటలైజేషన్‌‌ నెమ్మదిస్తోందని రాష్ట్ర ప్రభుత్వాలకు ఫిర్యాదు చేసింది. మొబైల్ ఫోన్ పరిశ్రమ డెవలప్‌‌ కావడానికి పన్నులను తగ్గించాలని, తగిన ట్యాక్స్‌‌ పాలసీని తయారు చేయాలని కోరింది. జీఎస్టీ వల్ల ఫోన్ల ధరలు బాగా పెరగడంతో కస్టమర్లు స్మార్ట్‌‌ఫోన్లు ఎక్కువగా కొనడం లేదని, ఫోన్ల ధరలు అందుబాటులో ఉంటేనే అమ్మకాలు బాగుంటాయని ఐసియా స్పష్టం చేసింది. జీఎస్టీ రేట్లను తగ్గిస్తే 2026 నాటికి ఇండియా మొబైల్‌‌ ఫోన్‌‌ ఇండస్ట్రీ మార్కెట్‌‌ 80 బిలియన్ డాలర్లకు చేరుతుందని తెలిపింది.

సెప్టెంబరు క్వార్టర్‌‌లో ఇదీ పరిస్థితి

కంపెనీ             షిప్‌‌మెంట్ల తగ్గుదల (%)

శామ్‌‌సంగ్‌‌                 -33

షావోమీ                    -17

ఒప్పో                       -16

వివో                         -13

రియల్‌‌మీ                -5