ఇంటికొచ్చి స్కానింగ్.. లింగ నిర్ధారణ ముఠాల నయా దందా ..

ఇంటికొచ్చి స్కానింగ్.. లింగ నిర్ధారణ ముఠాల నయా దందా ..
  • హాస్పిటళ్లపై నిఘా పెరగడంతో రూట్ మార్చిన కేటుగాళ్లు
  • కార్లు, బైకులపై పోర్టబుల్ మెషీన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లతో వచ్చి.. ఇండ్లలోనే పరీక్షలు
  • ఆడపిల్లని తేలితే.. అక్రమ క్లినిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లకు రిఫర్లు 
  • ఒక్కో స్కానింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు రూ.20 వేలు.. ఆపరేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు రూ.40 వేలు!
  • దళారులతో కలిసి పలువురు ఆర్ఎంపీల నెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వర్క్ 
  • నల్గొండ, ఖమ్మం, కామారెడ్డి, సూర్యాపేట తదితర జిల్లాల్లో అక్రమ దందా

హైదరాబాద్, వెలుగు:హాస్పిటళ్లు, స్కానింగ్ సెంటర్లపై వైద్య ఆరోగ్య శాఖ నిఘా పెంచడంతో లింగ నిర్ధారణ పరీక్షలు చేసే మాఫియా రూట్‌‌ మార్చింది. అక్రమంగా కొనుగోలు చేసిన పోర్టబుల్ అల్ట్రాసౌండ్ స్కానింగ్ మెషీన్‌‌లతో గ్రామాల్లో తిరుగుతూ.. పుట్టబోయేది ఆడా? మగా? అనేది చెప్పేస్తున్నారు. దీంతో రిజిస్టర్డ్ సెంటర్లపై నిఘా పెట్టి.. భ్రూణ హత్యలు తగ్గించామని చెబుతున్న ప్రభుత్వ లక్ష్యం నీరుగారుతున్నది. పోర్టబుల్ మెషీన్ల ద్వారా చేస్తున్న ఈ అక్రమ పరీక్షలతో పిండ దశలోనే ఆడబిడ్డ ఆయువు తీరిపోతున్నది. 

ఈ కొత్త తరహా భ్రూణ హత్యల దందా అనేక జిల్లాల్లో యథేచ్ఛగా సాగుతున్నది. ఈ పోర్టబుల్ మెషీన్లు కేవలం ల్యాప్‌‌టాప్ సైజులోనే ఉండటంతో ఈజీగా కార్లు, బైకులపై తీసుకెళ్తున్నారు. గ్రామాలు, ఇండ్లు, కొన్నిసార్లు కార్లలోనే ఈ పరీక్షల తతంగం నడిపిస్తున్నారు. ఇటీవలే నల్గొండ జిల్లా నకిరేకల్‌‌లో పోర్టబుల్ మెషీన్ల ద్వారా అక్రమంగా లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్న ముఠాను పోలీసులు, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు పట్టుకున్నారు. అంతకుముందు ఖమ్మం, సూర్యపేట, కామారెడ్డి తదితర జిల్లాల్లో కూడా ఈ తరహా ముఠాలను పోలీసులు అరెస్టు చేశారు. 

బ్లాక్ మార్కెట్ నుంచి కొనుగోలు 

దేశంలో పీసీపీఎన్‌‌డీటీ చట్టం ప్రకారం ఎలాంటి అల్ట్రాసౌండ్ మెషీన్‌‌నైనా అధికారిక రిజిస్ట్రేషన్ లేకుండా కొనడానికిగానీ, అమ్మడానికిగానీ వీల్లేదు. కానీ, ఈ అక్రమ ముఠాలు చట్టంలోని లూప్‌‌ హోల్స్‌‌ను వాడుకుంటున్నాయి. సరిహద్దు రాష్ట్రాలైన తమిళనాడు, కర్నాటక, ఒడిశా నుంచి అనధికారిక బయోమెడికల్ సర్వీస్ సెంటర్ల ద్వారా ఈ మెషీన్లను సేకరిస్తున్నాయి. మూతపడిన ప్రైవేట్ క్లినిక్‌‌ల నుంచి లేదా స్క్రాప్ కింద అమ్మే పాత మెషీన్లను దళారులు కొనుగోలు చేసి రీఫర్బిష్ చేస్తున్నారు. 

వీటికి తోడు చైనా వంటి దేశాల నుంచి ల్యాప్‌‌టాప్ సైజులో ఉండే పోర్టబుల్ స్కానర్లను ‘హ్యాండ్‌‌హెల్డ్ వెటర్నరీ స్కానర్స్’ అనే పేరుతో ఆన్‌‌లైన్ ద్వారా, దొంగచాటుగా దిగుమతి చేసుకుంటున్నారు. మనుషులకు వాడే మెషీన్లతో పోలిస్తే.. వీటికి మార్కెట్లో నిబంధనలు అంత కఠినంగా ఉండవు. దీంతో అధికారులు వీటిని గుర్తించడం కష్టంగా మారుతోంది. ఒకవేళ అధికారులు గుర్తించినా, వాటిని జంతువుల కోసం వాడుతున్నట్లు చెప్పి, అక్రమార్కులు తప్పించుకుంటున్నారు.   

అక్రమ దందాకు చెక్ పెట్టేదెలా? 

రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే పీసీపీఎన్‌‌డీటీ చట్టాన్ని పటిష్టం చేసింది. స్కానింగ్ చేసే ప్రతి పేషంట్ వివరాలను ఆన్‌‌లైన్‌‌లో నమోదు చేసేలా పోర్టల్‌‌ను అందుబాటులోకి తెచ్చింది. అలాగే, హాస్పిటల్స్, స్కానింగ్ సెంటర్లపై తనిఖీలు కూడా పెంచింది. అయితే, ఈ దందాను అరికట్టాలంటే ఈ చర్యలు మాత్రమే సరిపోవని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. వైద్య ఆరోగ్యశాఖ, పోలీసులు కలిసి ఉమ్మడిగా మఫ్టీలో గర్భిణీలను పంపి డెకాయ్ ఆపరేషన్లు నిర్వహించాలని చెప్తున్నారు. 

‘‘దళారులు, అనుమానాస్పద ఆర్‌‌ఎంపీల ఫోన్ నెట్‌‌వర్క్ లపై నిఘా పెట్టాలి. విక్రయించే ప్రతి పోర్టబుల్ మెషీన్‌‌కు జీపీఎస్ ట్రాకర్లను తప్పనిసరి చేస్తే వాటి కదలికలను ఎప్పటికప్పుడు కనిపెట్టవచ్చు. జంతువుల పరీక్షల పేరుతో దిగుమతి అయ్యే స్కానర్ల అమ్మకాలపై కఠిన నిబంధనలు అమలు చేయాలి. అన్నిటికంటే ముఖ్యంగా, గ్రామాల్లో ఆశా, అంగన్‌‌వాడీ కార్యకర్తల ద్వారా గర్భిణీల నమోదును పర్యవేక్షిస్తూ, గర్భస్రావాలు జరిగే కేసులపై విచారణ జరిపితేనే ఈ భ్రూణ హత్యలను ఆపొచ్చు” అని నిపుణులు సూచిస్తున్నారు.   

స్కానింగ్‌‌కు 20 వేలు.. ఆపరేషన్‌‌కు 40 వేలు 

ఈ అక్రమ లింగ నిర్ధారణ దందాలో ఆర్ఎంపీలు, కొంత మంది దళారులు కీలక పాత్ర పోషిస్తున్నారు. గ్రామాల్లో ఇప్పటికే ఆడపిల్లలు ఉన్న కుటుంబాల్లో మహిళ గర్భం దాల్చగానే.. వారిని సంప్రదిస్తున్నారు. పరీక్షలు, ఆపరేషన్లు రెండూ తామే చేస్తామని ప్యాకేజీలు మాట్లాడుకుంటున్నారు. నిజానికి సాధారణ డయాగ్నస్టిక్ సెంటర్లలో ఒక స్కానింగ్‌‌కు రూ. 1,000 నుంచి రూ. 3,000లోపే ఉంటుంది. 

కానీ, చట్టవిరుద్ధంగా చేసే ఈ పరీక్షల కోసం అక్రమార్కులు రూ. 20 వేల వరకు తీసుకుంటున్నారు. కడుపులో ఉన్నది ఆడబిడ్డ అని తెలిస్తే అబార్షన్ చేయించుకోవాలని ఒత్తిడి తెస్తున్నారు. అక్రమ అబార్షన్ సెంటర్లను కూడా రిఫర్ చేస్తూ ఒక్కో ఆపరేషన్‌‌కు రూ. 40 వేలకుపైనే వసూలు చేస్తున్నారు. మొత్తంగా ఒక్కో కుటుంబం నుంచి రూ. 60 నుంచి లక్ష దాక వసూలు చేస్తున్నారు. రాష్ట్రంలోని కొన్ని చోట్ల అక్రమంగా అబార్షన్ చేస్తున్న సమయంలో గర్భిణీలు మరణించిన ఘటనలు కూడా జరిగాయి.