- ఇందిరా పార్క్ వద్ద మిడ్ డే మీల్స్ కుకింగ్ వర్కర్స్ ధర్నా
ముషీరాబాద్, వెలుగు: జీవో నంబర్ 94 ప్రకారం మిడ్ డే మీల్స్ గైడ్లైన్స్ అమలు చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు డిమాండ్ చేశారు. తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ స్కూల్స్ మిడ్ డే మీల్స్ కుకింగ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఆదివారం ఇందిరా పార్క్ ధర్నా చౌక్ లో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమస్యలు పరిష్కరించేంత వరకు బీజేపీ పోరాటం చేస్తుందని తెలిపారు. మిడ్ డే మీల్స్ వర్కర్స్ కు గౌరవ వేతనంగా రూ.10 వేల నుంచి రూ.17 వేల వరకు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
పదేండ్ల కింద ఇచ్చినట్లు ఇప్పుడు ఇస్తామంటే కుదరదని, ప్రస్తుత రేట్లకు అనుగుణంగా ఇవ్వాలని కోరారు. యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు వడ్ల హనుమాండ్లు మాట్లాడుతూ అక్షయపాత్రకు సెంట్రలైజ్డ్ కిచెన్ అప్పగించడంతో మిడ్ డే మీల్స్ కార్మికులకు అన్యాయం జరుగుతోందన్నారు. వెంటనే జీవో నంబర్ 6, జీవో నంబర్ 19ని రద్దు చేయాలని కోరారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డి బాబాయ్, మంజుల, సంతోష, గంగాధర్, వెంకటేశ్, వరలక్ష్మి, శ్రీశైలం, గంగామణి పాల్గొన్నారు.
