కోల్‌బెల్ట్, వెలుగు: తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమం, గౌరవాన్ని ప్రభుత్వం కాపాడుతుందని ఎమ్మెల్సీ, తెలంగాణ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం తెలిపారు. ఆదివారం మంచిర్యాలలోని ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన తెలంగాణ ఉద్యమకారుల జిల్లా సమావేశంలో పాల్గొని మాట్లాడారు. 1969 నుంచి 2009 వరకు తెలంగాణ ఉద్యమకారులను గుర్తిస్తున్నామని తెలిపారు. ప్రభుత్వం తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కోసం కె.కేశవరావు ఆధ్వర్యంలో కమిటీ వేసిందని చెప్పారు. నిజమైన పోరాటయోధులను గుర్తించేలా కమిటీ విధివిధానాలను రూపొందిస్తుందని తెలిపారు.
తెలంగాణ ఉద్యమకారులు, అన్నివర్గాల ప్రజలతో ఈ నెల 23లోగా సంప్రదింపులు జరిపి తుది ప్రతిపాదనలు తీసుకుంటామని చెప్పారు. గుర్తింపు కార్డుల జారీ విషయంలో కమిటీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. అమరవీరుల ఫ్యామిలీలను గుర్తించి న్యాయం చేసేందుకు కృషి చేస్తామన్నారు. తెలంగాణ ఉద్యమాన్ని ప్రాంతీయవాదంగా చూడడం సరైంది కాదని, చారిత్రక, సామాజిక, ఆర్థిక పరిస్థితుల నుంచి ఉద్భవించిన ప్రజా ఉద్యమమని పేర్కొన్నారు. ఆధిపత్యం కోసం తెలంగాణ గౌరవాన్ని దెబ్బతీసేలా కొందరు ఏపీ నేతలు మాట్లాడడం సరైంది కాదన్నారు.
సినీరంగంలోనూ తెలంగాణ పట్ల చిన్నచూపు ఉందన్నారు. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి, అస్తిత్వం, భాష, సంస్కృతిని తక్కువ చేసి మాట్లాడే ప్రయత్నాలను ప్రజలు వ్యతిరేకిస్తారని తెలిపారు. రాజకీయ విభేధాలు ఉన్నప్పటికీ తెలంగాణ గౌరవం, రాష్ట్ర ప్రయోజనాల విషయంలో అన్ని రాజకీయ పక్షాలు ఒకే వేదికపై నిలవాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్రంలోని బొగ్గు బ్లాక్‌లన్నీ సింగరేణికి కేటాయించాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం సింగరేణి బొగ్గు గనులు విస్తరించిన ప్రాంతాన్ని పారిశ్రామిక కారిడార్‌గా గుర్తించాలన్నారు. తుమ్మడిహెట్టి వద్ద ప్రాజెక్టు కడితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సాగు, తాగునీరు లభిస్తుందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో ప్రజాధనం వృథా అయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
