మక్తల్, వెలుగు: పదవులు శాశ్వతం కాదు.. నియోజకవర్గాన్ని అభివృద్ది చేయడమే శాశ్వతమని మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. మక్తల్ నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు తెలిపారు.
ఆదివారం మక్తల్ పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గంలోని మండలాలు, గ్రామ పంచాయతీల వారీగా నాయకులు, కార్యకర్తలతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాల అమలు, ఇందిరమ్మ ఇండ్ల పురోగతిపై చర్చించారు.
నియోజకవర్గంలోని 284 బూత్‌ల్లో అర్హులైన కుటుంబాలకు ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. ప్రతి బూత్‌కు 10 నుంచి 12 ఇండ్ల చొప్పున కేటాయించనున్నట్లు తెలిపారు. సుమారు రూ.276 కోట్లతో 5,500 ఇందిరమ్మ ఇండ్లు నియోజకవర్గానికి మంజూరు కావడం సంతోషకరమన్నారు. నియోజకవర్గంలో 68 వేల రేషన్ కార్డులు మంజూరు చేసినట్లు తెలిపారు.
బీజేపీ సర్పంచ్ కాంగ్రెస్‌లో చేరిక..
మక్తల్ మండలం జౌలాపూర్ గ్రామానికి చెందిన బీజేపీకి చెందిన సర్పంచ్ మహాదేవమ్మ మంత్రి వాకిటి శ్రీహరి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. రాజకీయాలకు అతీతంగా గ్రామాల అభివృద్ధి, ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్నామని మంత్రి తెలిపారు. గ్రామస్తులు పార్టీలను పక్కకు పెట్టి అభివృద్ధి పనులకు చేయించుకోవాలన్నారు.
