న్యూఢిల్లీ: యావత్ దేశం ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తోన్న కేరళ, తమిళనాడు, అస్సాం, వెస్ట్ బెంగాల్, పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైంది. మొదటగా పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు చేపట్టారు. పోస్టల్ బ్యాలెట్లలో అస్సాం, బెంగాల్, పుదుచ్చేరిలో బీజేపీ అధిక్యంలో ఉండగా.. తమిళనాడులో డీఎంకే, కేరళలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ కూటమి ముందంజలో ఉంది.
రెండు చోట్ల పోటీ చేసిన టీవీకే చీఫ్ విజయ్ పెరంబూర్‌లో లీడ్‌లో కొనసాగుతుండగా.. తిరుచ్చి ఈస్ట్‌లో వెనకంజలో ఉన్నాడు. చెపాక్ అసెంబ్లీ సెగ్మెంట్లో తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ లీడ్‌లో ఉన్నారు. మైలాపూర్‌లో తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై వెనుకంజలో ఉన్నారు. ఎడప్పాడిలో మాజీ సీఎం పళనిస్వామి అధిక్యంలో కొనసాగుతున్నారు. కోయంబత్తూరు సౌత్‌లో మంత్రి సెంథిల్ బాలాజీ ముందంజలో ఉన్నారు.
వెస్ట్ బెంగాల్ సీఎం మమత బెనర్జీ భవానీపూర్ నియోజకవర్గంలో అధిక్యంలో కొనసాగుతున్నారు. నందిగ్రామ్ లో బెంగాల్ అపొజిషన్ లీడర్ సువేందు అధికారి ముందంజలో ఉన్నారు. పలువురు బీజేపీ అగ్రనేతలు కూడా అధిక్యం కనబరుస్తున్నారు. బెంగాల్లో టీఎంసీ, బీజేపీ మధ్య హోరాహోరీ పోరు నడుస్తోంది. ఎగ్జిట్ పోల్స్ అంచనా వేసినట్లుగానే బీజేపీ స్వల్ప మెజార్టీలో కొనసాగుతోంది.
