రాష్ట్రాల్లో కరెంటు కోతలు

రాష్ట్రాల్లో కరెంటు కోతలు
  • రాష్ట్రాల్లో కరెంటు కోతలు
  • 2 నుంచి 8 గంటలు సరఫరా బంద్
  • ఎండలతో పెరిగిన డిమాండ్
  • బొగ్గు కొరతతో తగ్గిన ఉత్పత్తి

న్యూఢిల్లీ: దేశంలో రికార్డు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. భరించలేని ఎండల కారణంగా డిమాండ్ పెరగడం, అదే సమయంలో తగినంత బొగ్గు లభించకపోవడంతో దేశంలోని పలు రాష్ట్రాలు విద్యుత్ సంక్షోభంలో కూరుకొనిపోయాయి. కరెంటుకు డిమాండ్ భారీగా పెరుగుతున్నా.. పవర్ ప్లాంట్ల వద్ద బొగ్గు స్టాక్ లేక ఉత్పత్తిని పెంచలేకపోతున్నాయి. దీంతో కాశ్మీర్ నుంచి ఆంధ్రప్రదేశ్ వరకు ప్రజలు కరెంటు కోతలతో అల్లాడిపోతున్నారు. రోజుకు కనీసం 2 గంటల నుంచి 8 గంటల వరకు కరెంట్​ కోతలు పెడుతుండటంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ముఖ్యంగా పారిశ్రామిక రంగం ఈ సారి ఎన్నడూ చూడని కరెంటు సంక్షోభాన్ని ఎదుర్కుంటోంది. ఈ ఏడాది మార్చిలో ఎండలు రికార్డు ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. ఏప్రిల్​లో ఎండలు ముదరడంతో ఫ్యాన్లు, ఏసీల వాడకం పెరిగి డిమాండ్ ఆల్ టైం రికార్డుకు చేరుకున్నది. ప్రస్తుతం దేశంలో రోజుకు 623 మిలియన్ యూనిట్ల కరెంట్​ కొరత ఉన్నది. 

ఉక్రెయిన్ ఎఫెక్ట్
దేశంలో ఉత్పత్తి అయ్యే కరెంట్​లో 70 శాతం థర్మల్ విద్యుత్ ప్లాంట్ల నుంచే వస్తోంది. బొగ్గు రవాణాకు సరిపడా రాక్స్ లేకపోవడంతో నిల్వలు తగ్గిపోయాయి. గత 9 ఏండ్లలో ఎన్నడూ లేనంత తక్కువ నిల్వలు ప్లాంట్ల వద్ద ఉన్నాయి. మరోవైపు ఉక్రెయిన్ యుద్దం కారణంగా బొగ్గు దిగుమతులకు ఆటంకం ఏర్పడటం వల్ల కూడా సరిపడా బొగ్గు లేదు. ప్రస్తుతం బొగ్గు నిల్వలు పెంచడానికి తగిన చర్యలు తీసుకోవల్సిన కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రాలను రాబోయే మూడేళ్లలో తగినంత బొగ్గును సమకూర్చుకోవాలని సలహా ఇస్తోంది. 

ఏపీలో కోతలే కోతలు
ఏపీలో ప్రతీరోజు 210 మిలియన్ యూనిట్ల డిమాండ్ ఉంటుండగా.. 50 మిలియన్ యూనిట్ల కొరత ఉంటోంది. ఏప్రిల్ చివరి నాటికి కరెంటు సంక్షోభం తీరిపోతుందని ఇందన శాఖ కార్యదర్శి శ్రీధర్ చెప్పారు. యూపీలో 23 వేల మెగావాట్ల డిమాండ్ ఉండగా.. కేవలం 20వేల మెగా వాట్లు మాత్రమే సప్లయ్ అవుతోంది. దీంతో చిన్న పట్టణాలు, గ్రామాల్లో కరెంటు కోతలు పెడుతున్నారు. జమ్మూ కాశ్మీర్, తమిళనాడు, జార్ఖండ్, పంజాబ్, హర్యానా, ఎంపీ, బెంగాల్, ఉత్తరాఖండ్, బీహార్ రాష్ట్రాల్లో కూడా డిమాండుకు తగినంత కరెంటు ఉత్పత్తి కావడం లేదు.

ఇప్పుడున్నది 25% నిల్వలే..
ఏప్రిల్ 27న దేశవ్యాప్తంగా 200.65 గిగావాట్ల పీక్ డిమాండ్ నమోదు కాగా.. 10.29 గిగావాట్ల పవర్ షార్టేజ్ వచ్చింది. ఇందుకు పవర్ ప్లాంట్లు పూర్తి సామర్థ్యం మేర పని చేయకపోవడమే కారణమని తెలిసింది. తాజా డేటా ప్రకారం దేశంలోని 147 నాన్ పిట్ థర్మల్ ప్లాంట్ల (బొగ్గు బావుల నుంచి 1500 కిలోమీటర్లకు పైగా దూరం ఉండే ప్లాంట్లు)లో 163 గిగా వాట్ల ఉత్పత్తి సామర్థ్యం ఉంది. అయితే సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ ప్రకారం వీటి వద్ద ఉండాల్సిన కనీస బొగ్గునిల్వల్లో కేవలం 25% మాత్రమే అందుబాటులో ఉన్నట్లు చెప్పింది.