దానం బినామీలు బెదిరిస్తున్నరు

దానం బినామీలు బెదిరిస్తున్నరు
  • దానం బినామీలు బెదిరిస్తున్నరు
  • కబ్జా పెట్టేందుకు ఇండ్లను ఖాళీ చేయాలంటున్నరు
  • బేగంపేటలోని ప్రకాశ్​నగర్ 
  • ఎక్స్​టెన్షన్ వాసుల ఆందోళన
  • ప్రజావాణి, పోలీస్​లకు ఫిర్యాదు

పంజాగుట్ట, వెలుగు: ఖైరతాబాద్​ఎమ్మెల్యే దానం నాగేందర్​అనుచరుల నుంచి తమకు ప్రాణహాని ఉందని, తమ ఇండ్లను కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తూ బెదిరింపులకు దిగుతున్నారని ప్రకాష్​నగర్​ఎక్స్​టెన్షన్​వాసులు ఆందోళన చేపట్టారు. సుమారు100 మంది కాలనీ వాసులు ‘‘దానం నాగేందర్​భూకబ్జాదారుడు, సుధీర్​గౌడ్​అనే వ్యక్తి నాగేందర్​బినామీ, వారు మమ్ములను హింసిస్తున్నారు.. తెలంగాణ సీఎం సమస్యను పరిష్కరించాలి’’ అనే స్లోగన్లతో ఉన్న బ్యానర్​పట్టుకొని మంగళవారం ప్రజాభవన్​కు వచ్చారు. ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. ఈ విషయం తెలసుకున్న దానం అనుచరులు కొంతమంది అక్కడికి చేరుకొని.. ఎవరెవరు ఫిర్యాదు చేస్తున్నారనేది తెలుసుకునేందుకు వీడియోలు తీశారు. దీంతో అక్కడ ఘర్షణ వాతావరణం ప్రారంభమైంది. తమను ఎందుకు వీడియో తీస్తున్నారటూ ఫిర్యాదుదారులు నిలదీయడంతో కొంతమంది పరారయ్యారు. నాగరాజు అనే ఒక వ్యక్తి దొరకడంతో అక్కడున్న వెస్ట్​జోన్​డీసీపీకి అప్పగించారు.

ఎకరా స్థలంలో..

కూకట్ పల్లి నియోజకవర్గం బాలానగర్ మండలం పరిధిలోని బేగంపేట ప్రకాష్​నగర్​ఎక్స్​టెన్షన్​లో  సర్వేనెంబరు 184,85, 86,87లో 5.13 గుంటలు, దానిపక్కనే 194/8-/1లో ఎకరం పైగా స్థలంఉంది. ఈ భూమంతా పైగా నవాబు వారసులది. అయితే 194/8/1లోని ఎకరా పైగా ఉన్న స్థలాన్ని 100,120 గజాల చొప్పున 20 ఏళ్లక్రితం ఓ వ్యక్తి నుంచి వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన తాము కొనుగోలు చేసి, ఇండ్లు కట్టుకొని నివాసం ఉంటున్నామని ఎక్స్​టెన్షన్​ కాలనీకి చెందిన 100 మంది బాధితులు చెబుతున్నారు. ప్రభుత్వం తమకు నల్లా కనెక్షన్​ఇచ్చి, రోడ్డు వేసిందని, తాము ట్యాక్స్​కూడా చెల్లిస్తున్నట్లు తెలిపారు. తమ ఇండ్ల పక్కనే ఉన్న స్థలాన్ని దానం నాగేందర్​కొనుగోలు చేశారని, ఆ స్థలంలో తమ భూమిని కలుపుకునేందుకు షెడ్లను, ఇండ్లను తొలగించేందుకు ప్రయత్నిస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. 

తాము ఇచ్చిన సొమ్మును తీసుకుని వెళ్లిపోవాలంటూ రాత్రుళ్లు గంజాయి బ్యాచ్​కొంతమంది వచ్చి బెదిరిస్తున్నట్లు చెబుతున్నారు. ఈ మేరకు తమ స్థలాలను కబ్జా చేసేందుకు దానం అనుచరులు ప్రయత్నిస్తున్నారని, తమకు ప్రాణహాని ఉందంటూ పంజాగుట్ట పోలీస్​ స్టేషన్​లో ఫిర్యాదు చేశారు.