విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ ఇటీవల నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు. తన నివాస ప్రాంతమైన బెంగళూరు ఓటర్ల జాబితా నుంచి తన పేరు మాయమైందంటూ సంచలన ఆరోపణలు చేశారు. 'పుట్టి పెరిగిన ఊర్లోనే నా ఓటు లేకుండా చేశారు.. ఇది పెద్ద జోక్' అంటూ సోషల్ మీడియాలో మండిపడుతూ పోస్ట్ చేసిన ఆయనకు ఎన్నికల అధికారులు ఘాటు సమాధానం ఇచ్చారు. ప్రకాశ్ రాజ్ ఓటును ఎలాంటి ఏకపక్ష నిర్ణయంతో తొలగించలేదన్నారు. ప్రత్యేక ఓటరు సవరణ (SIR)లో భాగంగా నిబంధనల ప్రకారమే చర్య తీసుకున్నామని స్పష్టం చేశారు.
అసలు ట్విస్ట్ ఏంటంటే..
ప్రకాశ్ రాజ్ ఓటరు నమోదైన శాంతినగర్ అపార్ట్మెంట్లో ఆయన నాలుగేళ్లుగా నివసించడం లేదని బూత్ లెవల్ అధికారులు గుర్తించారు. స్థానికులను విచారించి వివరాలు సేకరించిన అనంతరం అధికారులు ఆయనను సంప్రదించగా, తాను ఆ ఇంటిని ఖాళీ చేసి అదే ప్రాంతంలోని మరో చిరునామాకు మారిన విషయాన్ని స్వయంగా అంగీకరించినట్లు BBMP అధికారులు తెలిపారు. దీంతో పాత చిరునామా వద్ద ఆయన ఓటరు స్థితిని పర్మినెంట్గా షిఫ్ట్డ్ గా గుర్తించినట్లు వెల్లడించారు.
మళ్లీ నమోదు చేసుకోండి.
ఇదే విషయాన్ని ప్రకాశ్ రాజ్ మాత్రం మరో కోణంలో ప్రస్తావించారు. తనతో పాటు ఏకంగా 65 లక్షల మంది ఓటర్ల పేర్లు గాల్లోకి లేపేశారంటూ వీడియో విడుదల చేసి, అవసరమైతే న్యాయపోరాటం చేస్తానని ప్రకటించారు. అయితే అధికారులు మాత్రం కొత్త చిరునామాతో ఫారమ్-6 దాఖలు చేస్తే ఓటరుగా మళ్లీ నమోదు చేసుకోవచ్చని స్పష్టం చేశారు. ఎన్నికల సంఘం అధికారిక పోర్టల్లోనూ కొత్తగా ఓటరుగా నమోదు కావడానికి Form-6 అందుబాటులో ఉంది.
ALSO READ : అయ్యో టైటిల్ చెప్పేశానా.. మెగాస్టార్ 158 మూవీ టైటిల్ లీక్ చేసిన చిరంజీవి!
కర్ణాటకలో SIR సందర్భంగా పెద్ద సంఖ్యలో ఓటర్లను అందుబాటులో లేకపోవడం, స్థలం మారడం, అందుబాటులోకి రాకపోవడం , డూప్లికేట్ వంటి కేటగిరీల్లో గుర్తించారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 84.3 లక్షల మంది ఈ జాబితాలో ఉన్నట్లు నివేదికలు వెల్లడించాయి. అందుకే ప్రకాశ్ రాజ్ వివాదం ఇప్పుడు 'ఓటు తొలగించారా?' అన్న ప్రశ్న నుంచి చిరునామా మారితే ఓటును ఎలా అప్డేట్ చేసుకోవాలి?’ అన్న చర్చ వైపు మళ్లింది. అధికారులు మాత్రం తప్పుడు ఆరోపణలు చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు..
