ప్రతాపగిరి కట్టింది సామంత రాజే

ప్రతాపగిరి కట్టింది సామంత రాజే
  • శాసనంలో వెలుగు చూసిన విషయాలు
  • ప్రోలరాజు సేనాని ముప్పనాయుడు
  • ప్రతాప రుద్రుడికి ఆశ్రయం ఇచ్చిన కోట

వరంగల్‍, వెలుగు : కాకతీయుల కాలానికి ముందే గోదావరి తీరం వెంబడి శత్రు దుర్భేధ్యమైన రక్షణను నాటి పాలకులు ఏర్పాటు చేశారని చరిత్రకారులు అంటున్నారు.  ఇందుకు ప్రతాపగిరి కోటలే ఉదాహరణగా చూపెడుతున్నారు. ఇంతకాలం కాకతీయ రాజులు మొదటి లేదా రెండో ప్రతాపరుద్రుడు వీటిని నిర్మించినట్టుగా చరిత్రకారులు భావించారు. తాజాగా ఇక్కడ వెలుగుచూసిన శిలాశాసనంలో ఈ కట్టడం ప్రతాపరుద్రుడి కంటే ముందే నిర్మించినట్టుగా స్పష్టమైంది. దీంతో కాకతీయుల కాలానికంటే ముందే స్థానిక పాలకులు గోదావరి తీరం వెంబడి రక్షణ ఏర్పాట్లు చేసినట్టు స్పష్టం అవుతోంది.

కోట శాసనంతో వెలుగులోకి..

భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలం ప్రతాపగిరి గ్రామ సమీపంలో ఉన్న అడవుల్లో ఎత్తైన  ప్రతాపగిరి కోట ఉంది. ఢిల్లీ సుల్తానుల దండయాత్ర సందర్భంగా ఇక్కడ కొంతకాలం ప్రతాపరుద్రుడు ఉన్నట్టు చరిత్ర చెబుతోంది. ఇక్కడి నుంచే ప్రతాపరుద్రుడితో పాటు కాకతీయ పరివారం చత్తీస్‍గఢ్ ​అడవుల్లోకి వెళ్లి అక్కడ సామ్రాజ్య స్థాపన చేశారు. మరొకవాదన ప్రకారం ఈ  కోటను ప్రతాపరుద్రుడు నిర్మించాడని, అందుకే దీన్ని ప్రతాపగిరి కోటగా పిలుస్తారనే నేటి వరకు చరిత్రకారులు భావించారు. తెలంగాణ అంతటా చరిత్ర పరిశోధనలు చేస్తున్న కొత్త తెలంగాణ చరిత్ర  బృందం సభ్యులు అరవింద్ ఆర్య, తాళ్లపల్లి సదానందం, సముద్రాల సునీల్ ఇటీవల ఈ కోటలో పర్యటించారు. అక్కడ వారికి కోట గోడలపై ఆరు పంక్తుల శాసనం లభించింది. ఈ శాసనం పరిశీలించగా ఈ కోటకు సంబంధించిన కొత్త అంశాలు వెలుగులోకి వచ్చాయి.

ప్రతాపరుద్రుడి కంటే ముందే…

ప్రతాపగిరిలో లభించిన శాసనాన్ని ఇతర కాకతీయ శాసనాలతో పోల్చి చూడగా ప్రతాపగిరి కోటను కాకతీయులకు పూర్వమే నిర్మించినట్టుగా ఆధారాలు లభించాయి. ఈ విషయాన్ని కొత్త తెలంగాణ చరిత్ర బృందం కన్వీనర్ రామోజు హరగోపాల్ ధ్రువీకరించారు. ప్రతాపగిరి కోటను మొదటి, రెండవ ప్రతాపరుద్రులెవరు కట్టించలేదని, కాకతీయుల సామంతుడో,  సైనికాధికారో కట్టించిన కోట అని వారు చెబుతున్నారు. ఈ శాసనంలో పేర్కొనబడిన ముప్పనాయుడు కాకతీయ రాజు మొదటి ప్రోలరాజు వద్ద సామంతునిగా పని చేశాడు. ఇందుకు సంబంధించిన విషయాలు కరీంనగర్ జిల్లా శాసన సంపుటి 69వ శాసనంలో  పేర్కొన్నారు.

ఆ శాసనంలో ముప్పనాయుడు వివరాలు ఇలా ఉన్నాయి.. చక్రకూటం, కొంకణం, కొప్పర్తి, గుణసాగరం, వేములవాడ వంటి రాజ్యాలను గెలువడంలో ప్రోలరాజుకు సాయపడ్డాడు. ముప్పనాయునికి అరిరాయ గజ కేసరి, దాయ గజ కేసరి బిరుదులు ఉన్నాయి. సైన్యాధికారిగా విరియాల వారితో కలిసి కాకతీయ సామ్రాజ్య విస్తరణకు కృషి చేశాడని పేర్కొన్నారు. దీంతోపాటు మల్హర్‍ మండలం అడవి సోమన్‍పల్లి దగ్గర లభించిన శాసనంలో ముప్పనాయుని ప్రస్తావన ఉంది.  దీంతో ప్రతాపగిరి కోటను కాకతీయ సామ్రాజ్య స్థాపన సమయంలో లేదా అంతకంటే ముందే కట్టి ఉంటారని భావిస్తున్నారు.

జలదుర్గం

కాకతీయ కాలంలో గోదావరి నది తీరంలో వ్యూహాత్మక సైనిక స్థావరాలుగా ప్రస్తుతం ప్రతాపగిరిగా పిలుస్తున్న కొండలను ఉపయోగించుకున్నారు. గోదావరి నదిని దాటి వచ్చి దాడులు చేసే శత్రువులను నిరోధించడానికి దట్టమైన అడవుల్లో ఈ వనదుర్గాలను నిర్మించారు. రాజ్య పరిరక్షణలో భాగంగా గోదావరిని రక్షణ కవచంగావాడుకున్నారు. అందువల్ల ఈ కొండలపై నిర్మించిన దుర్గాలను జల దుర్గాలని పేర్కొంటున్నారు. ప్రతాపగిరి గుట్ట మీద నిర్మించినఈ కోట నాలుగు వరుస ప్రాకారాలతో నిర్మించి ఉంది. గుర్రాల మీద సైనికులు కోట కాపలా కాయడానికి కోట గోడ అంచున డంగు సున్నం , కంకరతో నిర్మించిన దారులున్నాయి. కోటగోడలకు వాడినరాళ్లను చక్కగా దీర్ఘచతురస్రాకారపు రాతిబిళ్లలుగా చెక్కారు. ఇంటర్ లాక్ పద్ధతిలో రెండువైపుల రాతిబిళ్లలను ఇటుకలుగా పేర్చి మధ్యలో తొక్కుడురాళ్లతో నింపారు.ఇంత ఎత్తైన పెద్దగుట్ట మీద కిలోమీటర్ల పొడుగునా శ్రమకోర్చి ఈ కోట గోడలుకట్టారు. నీటి కోసం సహజంగా ఏర్పడిన పల్లపు ప్రాంతాలను రిజర్వాయర్లుగా చేసుకున్నారు. అక్కడక్కడ రాళ్లతో గుండ్రంగా గోడలు కట్టిన బావులు కూడా ఉన్నాయి.

గుట్టపైకి గుర్రాలు ఎక్కడానికి అనువుగా చదునైన బండలమీద ఎత్తు తక్కువ మెట్లు చెక్కారు. కోట లోపల ఒకచోట కూలిన గుడిద్వార స్తంభాలు పడి ఉన్నాయి. కొన్నిచోట్ల జంతువులను అడ్డుకోవడానికి కంచె గోడలు కట్టుకున్న ఆనవాళ్లు కనిపిస్తున్నాయి.ఈ కోటలో ఒకచోట రాతిలో తొలిచిన సొరంగ మార్గముంది. ఈ సొరంగంలోధనం దాచారని పుకార్లున్నాయి. కానీ ఆ సొరంగంలోనికి వెళ్లి చూస్తే కొంతదూరం వెళ్లాక దారి ఆకస్మాత్తుగా పక్కకు తిరిగి ఉంది. శత్రువుల దాడుల నుంచి తప్పించుకోవడానికి అనువుగా దానిని నిర్మించారు.