మరో 306 స్కూళ్లలో ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్.. కొత్త విద్యా సంవత్సరం నుంచి ప్రారంభం

మరో 306 స్కూళ్లలో ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్.. కొత్త విద్యా సంవత్సరం నుంచి ప్రారంభం
  • ఇన్​స్ట్రక్టర్​లు, ఆయాల నియమాకానికి దరఖాస్తుల ఆహ్వానం
  • ప్రతి స్కూల్​లో కనీసం 20 అడ్మిషన్​ లు ఉండాలని ఆదేశాలు

మెదక్​, వెలుగు: ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా 2026– -27 విద్యా సంవత్సరంలో  ఎంపిక చేసిన   306 ప్రభుత్వ పాఠశాలల్లో ప్రీ-ప్రైమరీ విద్య ప్రారంభం కానుంది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. ఇందుకు అనుగుణంగా ఆయా పాఠశాలల్లో ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్ట్రక్టర్లు, ఆయాల నియామకానికి విద్యాశాఖ అధికారులు చర్యలు చేపట్టారు. ప్రభుత్వం గత ఏడాది ప్రీ-ప్రైమరీ విద్యా విధానాన్ని ప్రవేశపెట్టింది. 

తొలిదశలో ప్రయోగాత్మకంగా కొన్ని పాఠశాలల్లో అమలు చేయగా, మంచి ఫలితాలు రావడంతో రెండో దశలో మరిన్ని పాఠశాలలకు విస్తరించింది.  2025–26 విద్యా సంవత్సరంలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 109 పాఠశాలల్లో ప్రీ-ప్రైమరీ విద్య అమలవుతుండగా, కొత్త విద్యా సంవత్సరంలో మరో 306 పాఠశాలలకు అనుమతి లభించింది. వీటిలో అత్యధికంగా సంగారెడ్డి జిల్లాలో 132 పాఠశాలలు, మెదక్ జిల్లాలో 90 పాఠశాలలు, సిద్దిపేట జిల్లాలో 84 పాఠశాలలు ఉన్నాయి.  

మండల విద్యాశాఖ అధికారులు పంపిన నివేదికల ఆధారంగా స్థానిక సంస్థల ఆధ్వర్యంలోని ప్రాథమిక, ఉన్నత ప్రాథమిక ప్రభుత్వ పాఠశాలల్లో ప్రీ-ప్రైమరీ విద్య ప్రారంభించేందుకు విద్యాశాఖ ఉన్నతాధికారులు అనుమతులు మంజూరు చేశారు.

మహిళలకే ప్రాధాన్యం

పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్, సమగ్ర శిక్ష రాష్ట్ర ప్రాజెక్టు డైరెక్టర్  నవీన్​ నికోలస్​  ఆదేశాల మేరకు ఎంపిక చేసిన పాఠశాలల్లో ప్రీ-ప్రైమరీ తరగతుల నిర్వహణ కోసం ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్ట్రక్టర్లు, పిల్లల సంరక్షణ కోసం ఆయాల నియామక ప్రక్రియ ప్రారంభించారు. ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్ట్రక్టర్ పోస్టులకు పూర్వ ప్రాథమిక విద్యలో డీఈడీ పూర్తి చేసిన మహిళా అభ్యర్థులకు తొలి ప్రాధాన్యం ఇవ్వనున్నారు. అలాంటి అభ్యర్థులు అందుబాటులో లేకపోతే ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులైన స్థానిక మహిళలకు అవకాశం కల్పిస్తారు. 

ఆయా పోస్టులకు పదో తరగతి ఉత్తీర్ణులైన మహిళా అభ్యర్థులు అర్హులు. అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ఆధ్వర్యంలో సంబంధిత పాఠశాల ప్రధానోపాధ్యాయులు దరఖాస్తులు స్వీకరించి, విద్యాశాఖ మార్గదర్శకాల ప్రకారం అర్హులను ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్ట్రక్టర్లు, ఆయాలుగా ఎంపిక చేయనున్నారు.

కనీసం 20 అడ్మిషన్లు తప్పనిసరి

ప్రీ-ప్రైమరీ విద్యకు అనుమతి పొందిన పాఠశాలల ప్రధానోపాధ్యాయులు గ్రామాల్లో అవగాహన కల్పించి అడ్మిషన్లు పెంచేలా చర్యలు తీసుకోవాలని విద్యాశాఖ సూచించింది. ప్రతి పాఠశాలలో కనీసం 20 మంది విద్యార్థులు చేరేలా చూడాలని హెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎంలకు ఆదేశాలు జారీ చేసింది.  

అలాగే ప్రీ-ప్రైమరీ విద్య ప్రారంభమయ్యే స్థానిక సంస్థలు, ప్రభుత్వ ప్రాథమిక, ఉన్నత ప్రాథమిక పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనతో పాటు విద్యార్థులను ఆకర్షించేలా రంగులద్దేందుకు ఒక్కో పాఠశాలకు రూ.1 లక్ష చొప్పున నిధులు కేటాయించారు. అవసరమైన నిధులను సంబంధిత జిల్లా కలెక్టర్లు మంజూరు చేయనున్నారు.