సిట్టింగ్ జాబ్..ఇలా చేస్తే సేఫ్

సిట్టింగ్ జాబ్..ఇలా చేస్తే సేఫ్

ఇప్పుడున్న డిజిటల్ యుగంలో ఏ పని చేయాలన్న కంప్యూటరే దిక్కు. అందుకే అందరి ఉద్యోగాలు  కంప్యూటర్ ముందు కూర్చొని చేసేవే ఉంటున్నాయి. స్కూల్లో పిల్లల నుంచి ఆఫీస్‌‌‌‌లో ఉద్యోగుల దాకా అందరూ గంటల తరబడి కూర్చోవడమే. పోనీ మన శరీరం కూర్చోవడాన్ని ఈజీగా ఫీలవుతుందా అంటే అదీలేదు. కాసేపు కూర్చోగానే బ్యాక్ పెయిన్, కళ్ల మంటలు, వేళ్లు నొప్పులు ఇలా ఎన్ని సమస్యలో.. మరి వీటికి సొల్యూషన్ ఏది?

వరుసగా కొన్ని గంటలపాటు కూర్చొని ఉంటే శరీరం అన్‌‌ఈజీగా ఫీలవుతుంది. అందుకే కాసేపు ముందుకు వంగి, మరికొంతసేపు వెనక్కి వాలిపోయి పనిచేస్తుంటాం. ఎక్కువ సేపు కూర్చొని ఉండడం వల్ల రకరకాల సమస్యలు తలెత్తుతాయి. అందుకే కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే వీటి నుంచి కొంతైనా రిలీఫ్ పొందొచ్చు

బ్యాక్ పెయిన్

కూర్చొని పనిచేసే వాళ్లలో కామన్‌‌గా వచ్చే ప్రాబ్లమ్ బ్యాక్ పెయిన్. ఎక్కువసేపు కూర్చోవడం వల్ల వెన్నెముకలోని కీళ్లు, కండరాలు ఒత్తిడికి గురై నొప్పులు మొదలవుతాయి. కుర్చీలో ఏ పొజిషన్‌‌లో కూర్చున్నా.. ఈ నొప్పులు ఆగవు. అలాంటప్పుడు ఏం చేయాలంటే..వెన్ను నొప్పిగా అనిపిస్తే.. వెంటనే లేచి, నడవాలి. నడిచినప్పుడు వెన్నెముక కొంతవరకు రిలాక్స్ అవుతుంది. కదలకుండా రెండు గంటలకు మించి కూర్చోకూడదు. అలాగే కూర్చునేటప్పుడు పోశ్చర్ కరెక్ట్‌‌గా ఉండాలి. పాదాలు పూర్తిగా నేలపై ఆనేలా కూర్చొని, తొడలు నేలకు సమాంతరంగా ఉంచాలి. ఎత్తులో కూర్చోవాల్సి వస్తే కాళ్లను గాల్లో వేలాడేయకుండా ఏదైనా సపోర్ట్ వాడాలి. వెన్నెముక రిలాక్సేషన్​ కోసం రోజూ స్ట్రెచింగ్ వ్యాయామాలు చేయాలి .

మెడ నొప్పి

ఎక్కువ సేపు కూర్చుంటే మెడ కండరాలు కూడా పట్టేస్తాయి. ఒకసారి నొప్పి మొదలైతే మెడను ఎటూ వంచలేము. ఎటు వంచినా నొప్పి ఎక్కువతుంటుంది. దీనికి కారణం మెడను అనవసరంగా ముందుకు వంచడమే.. నిల్చున్నప్పుడు మెడ ఎలా స్ట్రైట్‌‌గా ఉంటుందో కూర్చున్నప్పుడు కూడా అంతే స్ట్రైట్‌‌గా ఉంచాలి. మెడ, భుజాలు ముందుకు వంగినప్పుడు అక్కడుండే కండరాల మీద ఒత్తిడి పెరిగి, మెడ, భుజాల నొప్పులు మొదలవుతాయి. అప్పుడేం చేయాలంటే..

వర్క్ మధ్యలో గ్యాప్ వచ్చిన్పపుడు మెడ, భుజాలు స్ట్రెచ్ అయ్యేలా ‘చిన్‌‌ టక్‌‌’ లాంటి చిన్న చిన్న వ్యాయామాలు చేయాలి. మానిటర్‌‌‌‌ను కళ్లకు సమాంతరంగా ఉంచి, వెన్ను నిటారుగా ఉండేలా చూసుకోవాలి. మెడను అవసరానికి మించి ముందుకు వంచకూడదు. భుజానికి, చెవికి మధ్యలో ఫోన్‌‌ ఉంచుకుని మాట్లాడే అలవాటు మానుకోవాలి.

కళ్ల మంటలు

కంప్యూటర్‌‌ ముందు పనిచేసే వాళ్లకి కళ్లమంటల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. దాదాపుగా అందరికీ ఉండే ప్రాబ్లమ్ ఇది. కంప్యూటర్ స్క్రీన్ కళ్లకు మరీ దూరంగా ఉంటే, అక్షరాలు సరిగా కనిపించక ఫోకస్ చేయడానికి కళ్లు ఇబ్బంది పడతాయి. అలాగే స్క్రీన్ మరీ దగ్గరగా ఉంటే మానిటర్‌‌ లైటింగ్‌‌కు కళ్లు స్ట్రెస్ ఫీలవుతాయి. ఈ రెండు కారణాల వల్లే కళ్ల మంటలు వస్తాయి. కళ్లు ఎక్కువ కష్టపడ్డప్పుడు అలసటకు గురై మంటలు వస్తాయి. అలాగే గంటల తరబడి కంప్యూటర్‌‌ స్ర్కీన్‌‌ని చూడడం వల్ల కళ్లు పొడిబారి, నీళ్లు కారతాయి. అలాంటప్పుడు ఏం చేయాలంటే..

కంప్యూటర్‌‌ ముందు ఎక్కువగా పని చేసేవాళ్లు ప్రతి గంటకూ కళ్లకు రెస్ట్ ఇవ్వాలి. అప్పుడప్పుడు ఫోకస్ ఎక్సర్‌‌‌‌సైజ్ చేస్తుండాలి. అంటే.. దూరంగా ఉన్న వస్తువుని కాసేపు చూసి, మళ్లీ దగ్గరగా ఉన్న వస్తువును ఫోకస్ చేయాలి. కళ్లకు, మానిటర్‌‌కు కనీసం 20 నుంచి 40 అంగుళాల దూరం ఉండేలా చూసుకోవాలి.

కంప్యూటర్ స్క్రీన్, కన్ను ఒకే లెవెల్‌‌లో ఉండేలా చూసుకోవాలి. మానిటర్ బ్రైట్‌‌నెస్ కాస్త తగ్గించుకుని, బ్లూ లైట్ ఫిల్టర్ అప్లై చేయాలి. కళ్లజోడు వాడేవాళ్లు మామూలువి కాకుండా యాంటీ రిఫ్లెక్షన్ కోటింగ్ ఉన్న అద్దాలు తీసుకోవాలి. కనురెప్పలు ఎక్కువగా మూస్తుండాలి.

వేళ్ల నొప్పులు

కంప్యూటర్ ముందు పని చేసేవాళ్లు చేతులకు పని చెప్పకతప్పదు. అందుకే అప్పుడప్పుడు వేళ్లు, మణికట్టు నొప్పి పెడతాయి. వేళ్లు, మణికట్టు చాలా సెన్సిటివ్ భాగాలు వాటికేదైనా సమస్య వస్తే.. మిగతా పనులకు ఆటంకం ఏర్పడుతుంది. అందుకే వేళ్లను కాపాడుకోవాలంటే..

కీబోర్డ్‌‌పై పనిచేసేటప్పుడు కూర్చున్న ప్లేస్ నుంచి కీబోర్డ్ సమాన దూరంలో, ఎత్తులో ఉండేట్లు చూసుకోవాలి. మౌస్ కీబోర్డు కంటే ఎక్కువ ఎత్తులో ఉండకూడదు. కీబోర్డ్ పై టైప్ చేసేటప్పుడు అరచేతిని టేబుల్‌‌ మీద ఆన్చాలి. చేతి మధ్యభాగం టేబుల్‌‌కు తాకకుండా కాస్త ఎత్తులో పెట్టాలి. కీబోర్డ్ అడుగున ఉండే స్టాండ్‌‌ను వాడి, కీబోర్డ్ కాస్త ఎత్తుకి లేపాలి. అలాగే అప్పుడప్పుడు వేళ్లు, మణికట్టు రిలాక్స్ అయ్యేలా.. పిడికిలి బిగించి, రిలీజ్ చేయడం, సాఫ్ట్ బాల్‌‌ను వత్తడం లాంటి చిన్నచిన్న వ్యాయామాలు కూడా చేయొచ్చు.