యునిక్​ జువెలరీ తయారుచేయడమే ప్రీతి మగ్గొ స్పెషాలిటీ

యునిక్​ జువెలరీ తయారుచేయడమే ప్రీతి మగ్గొ స్పెషాలిటీ

నయా ట్రెండ్ పేరుతో రకరకాల ఫ్యాషన్స్​ వచ్చేస్తున్నాయి మార్కెట్​లోకి. అలా బిడ్డ పుట్టాక పాలతో నగలు చేయించుకుంటున్నారు కొందరు. ఇంకొందరేమో రక్తంతో జువెలరీ చేయించుకుంటున్నారు. అదేంటి అంటున్నారా? ఈ జువెలరీ ఇన్​స్టాగ్రామ్​లో హల్​చల్ చేస్తోంది. దీని వెనక కథ తెలిస్తే ఐడియా సూపర్ అనడం ఖాయం.

చనిపోయిన తండ్రి గుర్తుగా, ఆయన రక్తంతో నగలు చేయమని ప్రీతి మగ్గొ అనే జువెలరీ డిజైనర్​ను అడిగింది ఒకావిడ. దాంతో చనిపోయిన ఆ తండ్రి డ్రై బ్లడ్​తో చెవి దిద్దులు, లాకెట్​ తయారుచేసి ఇచ్చింది. ఇన్​స్టాగ్రామ్​లో పెట్టిన ఆ జువెలరీ ఫొటోలు నెటిజన్​లను ఆశ్చర్యపరుస్తున్నాయి. 

ప్రీతి మగొ ఎవరంటే...

యునిక్​ జువెలరీ తయారుచేయడమే ప్రీతి మగ్గొ స్పెషాలిటీ. ఎంత యునిక్​ అంటే.. డీఎన్​ఏ ఉండే మెటీరియల్​ అంటే చనుబాలు, వెంట్రుకలు, ​బొడ్డు తాడు, విరిగిన దంతాలు, గోర్లు వంటి వాటితో జువెలరీ తయారుచేస్తుంటుంది. ఇప్పుడు డ్రై బ్లడ్​తో నగలు తయారుచేసింది. ‘‘మీరెవరైనా పైన చెప్పిన మెటీరియల్​తో నగలు చేయించుకోవాలంటే నా ఇన్​స్టాగ్రామ్ అకౌంట్​లో రిక్వెస్ట్ పెట్టండి” అంటోంది న్యూఢిల్లీకి చెందిన ప్రీతి మగ్గొ. 

మొదట్లో ఒక కంటి ఆసుపత్రిలో ఆప్టొమెట్రిస్ట్​గా పనిచేసింది ప్రీతి. ఆ టైంలోనే ఆమె ప్రెగ్నెంట్ అయింది. బిడ్డ పుట్టాక డ్యూటీ చేయడం ఇబ్బంది అవుతుందని జాబ్ మానేసింది. కానీ ఖాళీగా ఉండడం నచ్చలేదామెకు. ఇంకేదైనా చేయాలని గట్టిగా అనుకుంది. అప్పుడే ఫేస్​బుక్​లో చనుబాలతో తయారుచేసిన నగలు చూసింది. అవి ఆమెని అట్రాక్ట్​ చేశాయి. అప్పటి నుంచే ప్రీతి జర్నీ స్టార్ట్​ చేసింది. చనుబాలతో నగలు ఎలా తయారుచేస్తున్నారన్న దాని మీద రీసెర్చ్ చేసింది. తన ఆలోచన​ గురించి భర్తకు చెప్పింది. భర్త ఎంకరేజ్​ చేశాడు. 

ఆ తరువాత జువెలరీ డిజైనింగ్​ మీద అమెరికాలో కొన్ని కోర్సులు చేసింది. మొదటగా ఆమె తన చనుబాలతోనే జువెలరీ తయారుచేసింది. ఆ తర్వాత ఫ్రెండ్స్, ఫ్యామిలీకి చేసిచ్చింది. అలాగని ఆమె అనుకోగానే సక్సెస్​ రాలేదు. చాలాసార్లు ఫెయిలైంది. అలా ఫెయిలైన ప్రతిసారి వాటినుంచి ఎంతోకొంత నేర్చుకునేది. అలా 2019లో బిజినెస్​ మొదలుపెట్టింది. ప్రీతి దగ్గర నగలు కొన్నవాళ్లు వాటిని ఇన్​స్టాగ్రామ్​లో పోస్ట్​ చేయడంతో కస్టమర్స్​ పెరిగారు. దాంతో ఆమె బొడ్డు తాడు, వెంట్రుకలు, దంతాలతో నగలు తయారుచేయడం కూడా నేర్చుకుంది. అలాగే క్లయింట్స్​ కోరిక మేరకు ఇసుక, పువ్వులు వంటి రకరకాల ఐటమ్స్​తో నగలు తయారు చేస్తోంది. నగలతో పాటు.. వెంట్రుకలతో పోట్రెయిట్​లు కూడా చేస్తోంది.