చిరంజీవికి పద్మవిభూషణ్‌ పురస్కారం ప్రదానం

చిరంజీవికి పద్మవిభూషణ్‌ పురస్కారం ప్రదానం

మెగాస్టార్  చిరంజీవికి దేశంలోని రెండో అత్యున్నత పురస్కారం పద్మ విభూషణ్ అందుకున్నారు.  ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ అవార్డును  చిరంజీవికి అందించారు. చిరంజీవితో పాటుగా పలువురు పద్మ అవార్డులు అందుకున్నారు.  కళారంగానికి అందించిన సేవలకు గుర్తింపుగా చిరంజీవికి పద్మ విభూషణ్ పురస్కారం లభించింది.  ఈ కార్యక్రమంలో చిరంజీవి సతీమణి సురేఖ, కుమారుడు రామ్ చరణ్, కోడలు ఉపాసన పాల్గొన్నారు.  

ఈ ఏడాది కేంద్రం ఐదుగురికి పద్మ విభూషణ్, 17 మందికి పద్మ భూషణ్, 110 మందికి పద్మ శ్రీ పురస్కారాలు ప్రకటించింది. 1978లో సినీ కెరీర్ ప్రారంభించిన చిరంజీవి స్వయం కృషితో  అలుపెరగకుండా సినిమాలు చేస్తూ..ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచారు.  సినిమాలే కాకుండా  సామాజికంగా ఎన్నో సేవలు చేశారు. గతంలో  కేంద్ర ప్రభుత్వం చిరంజీవిని పద్మభూషణ్‌ అవార్డుతో సత్కరించిన సంగతి తెలిసిందే.

ఇక చిరు సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ఆయన  విశ్వంభర మూవీతో ప్రేక్షకులను పలకరించనున్నారు. బింబిసార ఫేమ్ వశిష్ట ఈ చిత్ర దర్శకుడు. సోషియో ఫాంటసీ నేపథ్యంలో తెరకెక్కుతుంది. చిరంజీవికి జోడీగా త్రిష నటిస్తుంది. ఈషా చావ్లా, సురభి వంటి యంగ్ హీరోయిన్స్ సైతం జాయిన్ అయ్యారు. వచ్చే ఏడాది సంక్రాంతికి సినిమాను రిలీజ్ చేయనున్నారు.