స్కానింగ్ కోసం 200 కిలోమీటర్లు పోయిరావాలె!

స్కానింగ్ కోసం 200 కిలోమీటర్లు పోయిరావాలె!

ఆసిఫాబాద్/ జైనూర్, వెలుగు: కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా ఏజెన్సీ ప్రాంతాల్లోని గర్భిణులు ప్రయాణభారంతో సతమతమవుతున్నారు. స్కానింగ్ కోసం 200 కిలోమీటర్ల దూరం ప్రయాణించాల్సి వస్తోంది. స్కానింగ్ కోసం జైనూర్, సిర్పూర్ యు, లింగాపూర్​ మండలాల్లోని మారుమూల గ్రామాల నుంచి జైనూర్ కు.. అక్కడ నుంచి ఆదిలాబాద్ రిమ్స్ కు వెళ్లాల్సి వస్తోంది. వెళ్లడానికి వంద.. రావడానికి మరో వంద కిలోమీటర్ల ప్రయాణం తప్పడం లేదు. ఈ మూడు మండలాల్లో అధిక సంఖ్యలో ట్రైబల్స్ ఉన్నారు. ఆశ వర్కర్లకు కూడా వారిని తరలించడం తలనొప్పిగా మారింది. అందరినీ ఒకేసారి తీసుకెళ్లడం సాధ్యం కాదని బ్యాచ్ ల వారీగా తరలిస్తూ స్కానింగ్ చేయిస్తున్నారు. తిర్యాణి మండలంలో స్కానింగ్ సౌలత్​లు లేక గర్భిణులు 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న మంచిర్యాలకు వెళుతున్నారు. అధికారిక లెక్కల ప్రకారం ఏప్రిల్ నుంచి జూన్ వరకు జిల్లాలో మొత్తం 2,890 మంది గర్భిణులు ఉన్నారు. వీరిలో 530 మంది వరకు ఏజెన్సీ ప్రాంతాలకు చెందినవారు.  దూర ప్రయాణంతో గర్భిణులు ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఒళ్లు నొప్పులతో రోజంతా బాధ పడాల్సి వస్తోందని వాపోతున్నారు. కొన్ని సందర్భాల్లో డెలివరీ కష్టంగా మారుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జైనూర్ మారుమూల గ్రామాల నుంచి రోడ్డు సౌకర్యం సక్రమంగా లేక మరింత ఇబ్బందులు పడుతున్నారు. 

సీహెచ్​సీల్లో సిబ్బంది లేక..
గర్భం దాల్చినప్పటి నుంచి డెలివరీ అయ్యేవరకు బిడ్డ ఎదుగుదల, ఆరోగ్యం ఎలా ఉందో తెలుసుకోవడానికి కనీసం మూడుసార్లు స్కానింగ్ చేయాల్సి ఉంటుంది. కమ్యూనిటీ హెల్త్​సెంటర్లలో(సీహెచ్ సీ) ఆధునిక యంత్రాలు ఉన్నప్పటికీ సంబంధిత డాక్టర్లు లేరు. ముఖ్యంగా రేడియాలజిస్టులు లేకపోవడంతో స్కానింగ్ కోసం వందలాది కిలోమీటర్లు పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఏజెన్సీలో రక్తహీనత బాధితులు కూడా ఎక్కువే. పైగా దూర ప్రయాణం మరిన్ని ఆనారోగ్య సమస్యలకు కారణంగా మారుతోంది. అందుకే సాధారణ డెలివరీ కష్టంగా మారిందని ఇక్కడి మహిళలు చెబుతున్నారు. ఏటా ఏజెన్సీ ప్రాంత మహిళల్లో నార్మల్ డెలివరీలు తగ్గుతున్నాయని, సిజేరియన్​కేసులు పెరుగుతున్నాయని ఈ ప్రాంత ఆశ వర్కర్లు సైతం పేర్కొంటున్నారు. 

అందరికీ అనుకూలంగా జైనూర్​
సిర్పూర్​ యు, లింగాపూర్, తిర్యాణి ఈ మూడు మండలాలకు కేంద్ర బిందువుగా జైనూర్ హాస్పిటల్ ఉంది. ఇక్కడ 30 పడకల ఆసుపత్రి కట్టినప్పటికీ స్కానింగ్ సౌకర్యం లేదు. ఇక్కడ స్కానింగ్ సౌకర్యం ఏర్పాటు చేస్తే మూడు మండలాల గర్భిణులకు అనుకూలంగా ఉంటుంది. ఇక్కడ ఏర్పాటు చేయాలని ఏజెన్సీవాసులు 
కోరుతున్నారు.

మస్తు తఖ్లీఫ్​ అయితంది
తిర్యాణి గవర్నమెంట్ దవాఖానలో స్కానింగ్ సౌకర్యం లేదు. స్కానింగ్ తీయడానికి డాక్టర్లు మంచిర్యాల దవాఖానకు రెఫర్​ చేస్తున్నరు. అంబులెన్స్ లో పోయి రావడానికి 130 కిలోమీటర్లు ప్రయాణం. ఇంటికి వచ్చేసరికి మస్తు తఖ్లీఫ్​అయితంది. ఆఫీసర్లు ప్రజా ప్రతినిధులు మండల కేంద్రంలో స్కానింగ్ సెంటర్ ఏర్పాటు చేస్తే బాగుంటది.
– ఆత్రం తానేశ్వరి, చింతపల్లి, తిర్యాణి

జైనూర్ లో ఏర్పాటు చేస్తం
ఏజెన్సీ ప్రాంతంలోని జైనూర్ గవర్నమెంట్ దవాఖానలో త్వరలోనే రేడియాలజిస్ట్​ను నియమిస్తాం. చుట్టుపక్కల మండలాల గర్భిణులకు జైనూర్ లో స్కానింగ్ చేసేలా చర్యలు తీసుకుంటాం. రక్తం తక్కువగా ఉన్న గర్భిణులను ఉట్నూర్, ఆసిఫాబాద్ హాస్పిటళ్లకు తరలించి రక్తం ఎక్కిస్తున్నం. రక్తహీనత లోపం లేకుండా తీసుకోవాల్సిన పౌష్టికాహారంపై అవగాహన కల్పిస్తున్నం. నెల నెలా క్రమం తప్పకుండా ట్రీట్​మెంట్​  అందిస్తున్నం.
– మనోహర్, డీఎంహెచ్ ఓ