యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామిని ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము శుక్రవారం దర్శించుకున్నారు. గర్భగుడిలో స్వయంభూ నారసింహుడికి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ముఖమంటపంలో ముర్ము, తమిళిసైకి అర్చకులు చతుర్వేద పారాయణ ఆశీర్వచనం చేశారు. అనంతరం హైదరాబాద్ చేరుకున్న ముర్ము.. మూడు రోజుల పర్యటన ముగించుకుని ఢిల్లీ బయల్దేరారు.
యాదగిరిగుట్ట/ హైదరాబాద్, వెలుగు: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీ నరసింహస్వామిని ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము శుక్రవారం దర్శించుకున్నారు. ఆమె వెంట కూతురు ఇతిశ్రీ, రాష్ట్ర గవర్నర్ తమిళిసై ఉన్నారు. ముర్ముకు ఉత్తర రాజగోపురం వద్ద ఆలయ ప్రధానార్చకులు నల్లంథీగల్ లక్ష్మీనరసింహాచార్యులు, ఈవో గీతారెడ్డి ఆలయ సంప్రదాయాల ప్రకారం పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. రాష్ట్రపతి గర్భగుడిలో స్వయంభూ నారసింహుడికి ప్రత్యేక పూజలు చేశారు. తర్వాత ఆలయ ముఖమంటపంలో ముర్ము, తమిళిసైకి అర్చకులు చతుర్వేద పారాయణ ఆశీర్వచనం చేశారు. దేవాదాయ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, దేవాదాయ శాఖ కమిషనర్ అనిల్ కుమార్ ప్రెసిడెంట్కు స్వామివారి ఫొటోను బహూకరించగా.. ఆలయ చైర్మన్ నరసింహమూర్తి లడ్డూప్రసాదం, ఈవో గీతారెడ్డి స్వామివారి శేషవస్త్రాలు అందజేశారు. ప్రధానాలయం నుంచి బయటకు వెళ్తూ ధ్వజస్తంభానికి, స్వయంభూ మూర్తికి ముర్ము గిరిజన సంప్రదాయరీతిలో నమస్కరించారు. తర్వాత అద్దాల మండపాన్ని సందర్శించారు. అక్కడే ఏర్పాటు చేసిన యాదగిరిగుట్ట ఆలయ చరిత్ర, పునర్నిర్మాణానికి సంబంధించిన ఫొటో గ్యాలరీని చూశారు. యాదగిరిగుట్ట ఆలయ చరిత్ర, పునర్నిర్మాణం గురించి రాష్ట్రపతికి ఈవో వివరించారు. అనంతరం రాష్ట్రపతితో కలిసి టెంపుల్ స్టాఫ్ ఫొటో దిగారు.
ప్రెసిడెంట్కు గ్రాండ్ వెల్కమ్
హైదరాబాద్ నుంచి హెలికాప్టర్ ద్వారా యాదగిరిగుట్టకు చేరుకున్న ప్రెసిడెంట్ కు యాదాద్రిలో మంత్రులు జగదీశ్ రెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి, సత్యవతి రాథోడ్, రాచకొండ సీపీ మహేశ్ భగవత్, యాదాద్రి కలెక్టర్ పమేలా సత్పతి స్వాగతం పలికారు. ప్రెసిడెంట్ టూర్ నేపథ్యంలో రింగ్ రోడ్డు, మెయిన్ రోడ్డు, ఆలయ పరిసరాల్లోకి భక్తులు, స్థానికులను అనుమతించలేదు. ముర్ము పర్యటన 55 నిమిషాల్లో ముగిసింది. 10:30 గంటలకు హెలికాప్టర్ లో హైదరాబాద్ కు తిరుగు ప్రయాణమయ్యారు.

