రామప్ప శిల్పాలు అద్భుతం : రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

రామప్ప శిల్పాలు అద్భుతం : రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

రామప్ప శిల్పాలు అద్భుతంగా ఉన్నాయని, రామలింగేశ్వర స్వామి గుడి.. ప్రపంచం గర్వించే దేవాలయమని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. బుధవారం భద్రాచలంలో సీతారామ చంద్రస్వామిని దర్శించుకుని పూజలు చేసిన అనంతరం ప్రెసిడెంట్​ ప్రత్యేక హెలికాప్టర్‌‌‌‌లో మధ్యాహ్నం 2.45 గంటలకు రామప్ప ఆలయానికి చేరుకున్నారు. రామప్ప గేట్‌‌‌‌ నుంచి కాలి నడకన దేవాలయానికి చేరుకున్న ఆమె.. రుద్రేశ్వరుడిని దర్శించుకుని పూజలు చేశారు.

భద్రాచలం/జయశంకర్‌‌ భూపాలపల్లి/వెంకటాపూర్‌‌(రామప్ప), వెలుగు: పదమూడో శతాబ్దానికి చెందిన రామప్ప శిల్పాలు తనను ఎంతగానో అబ్బురపరిచాయని.. రామలింగేశ్వర స్వామి గుడి ప్రపంచం గర్వించే దేవాలయమని రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము అన్నారు. మన చరిత్రను భవిష్యత్‌‌ తరాలకు అందించాల్సిన బాధ్యత మనపైనే ఉందన్నారు. బుధవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని భద్రాచలం, ములుగు జిల్లాలోని రామప్ప ఆలయంలో ప్రసాద్ పథకంలో భాగంగా పలు అభివృద్ధి పనులకు రాష్ట్రపతి శంకుస్థాపనలు చేశారు. భద్రాచలంలోని వీరభద్ర కల్యాణ మండపంలో ఏర్పాటు చేసిన సమ్మక్క సారలమ్మ గిరిజన పూజారుల సమ్మేళనాన్ని ప్రారంభించారు. తర్వాత ఆసిఫాబాద్, మహబూబాబాద్ జిల్లాల్లో నిర్మించిన ఏకలవ్య మోడల్​ రెసిడెన్షియల్ స్కూళ్లను వర్చువల్‌గా ప్రారంభించారు. ఈ సందర్భంగా ‘అందరికీ నమస్కారం’ అంటూ తెలుగులో స్పీచ్ ప్రారంభించారు. ప్రముఖ కవి దాశరథి రాసిన ‘నా తెలంగాణ కోటి రతనాల వీణ’ కవితా పంక్తులను ప్రస్తావించారు. తెలంగాణలో మొదటిసారి పర్యటిస్తున్నానని చెప్పారు. ప్రసాద్ స్కీమ్ ద్వారా ఆలయాలను అభివృద్ధి చేస్తున్న కేంద్ర పర్యాటక శాఖను అభినందించారు. దేవాలయాల్లో సౌకర్యాలు మెరుగుపడితే దేశ, విదేశీ యాత్రికులు పెరిగి పర్యాటక రంగం అభివృద్ధి చెందుతుందని, ఆధ్యాత్మిక, సాంస్కృతిక శోభ నెలకొంటుందన్నారు. తెలంగాణ వనవాసీ పరిషత్ ద్వారా గిరిజన సంస్కృతి సంప్రదాయాల పరిరక్షణకు జరుగుతున్న కృషిని రాష్ట్రపతి కొనియాడారు. సమ్మక్క సారలమ్మ లాంటి జాతరలు సమాజ మూల విలువలను పటిష్టం చేస్తాయన్నారు. అన్ని రంగాల్లోనూ మహిళల భాగస్వామ్యం ఉండాలని, గిరిజన మహిళల ఆర్థిక స్వావలంబన కోసం మరిన్ని చర్యలు అవసరమన్నారు.

కాలి నడకన దేవాలయానికి.. 

భద్రాచలం నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌‌లో మధ్యాహ్నం 2.45 గంటలకు రామప్ప ఆలయం వద్దకు రాష్ట్రపతి చేరుకున్నారు. రామప్ప గేట్‌‌ నుంచి కాలి నడకన దేవాలయానికి చేరుకున్నారు. పూజారులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. రుద్రేశ్వరుడిని దర్శించుకుని రాష్ట్రపతి పూజలు చేశారు. మేడారం ఆదివాసీ పూజారులు సమ్మక్క సారలమ్మ సారె, చీరలను రాష్ట్రపతి, గవర్నర్‌‌లకు అందజేశారు. తర్వాత దేవాలయం చుట్టూరా తిరుగుతూ రామప్ప శిల్పాలను రాష్ట్రపతి పరిశీలించారు. రామప్ప దేవాలయలో సెంట్రల్‌‌ ఆర్కియాలజీ డిపార్ట్‌‌మెంట్‌‌ ఆధ్వర్యంలో ప్రసాద్‌‌ స్కీం కింద చేపట్టబోయే రూ.62 కోట్ల పనులతో పాటు రూ.15 కోట్లతో కామేశ్వర ఆలయ పునరుద్ధరణ పనులను రాష్ట్రపతి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సాంస్కృతిక కార్యక్రమాలు, స్థానిక కొమ్ముకోయ కళాకారుల బృందం చేపట్టిన సమక్క సారలమ్మ ప్రదర్శన అలరించాయి. అయితే, ముర్ము కూర్చున్న వేదిక నుంచి సుమారు 300 మీటర్ల దూరంలో ఏర్పాటు చేసిన ఎల్‌‌ఈడీ స్క్రీన్‌‌ వద్ద షార్ట్‌‌ సర్య్కూట్‌‌ తో మంటలు చెలరేగి పొగలు వచ్చాయి. వెంటనే అలర్ట్‌‌ అయిన పోలీసులు, అగ్నిమాపక శాఖ సిబ్బంది మంటలను ఆర్పేశారు.    

గిరిజన సంక్షేమానికి కృషి: సత్యవతి 

గిరిజన సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నదని గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. రాష్ట్రంలో 23 ఏకలవ్య స్కూళ్లు నడున్నాయని, 33 గురుకులాలు ఆడపిల్లల కోసమే నిర్వహిస్తున్నామని చెప్పారు. మేడారం, నాగోబా జాతరలను రాష్ట్ర జాతరలుగా గుర్తించామన్నారు. 3,146 గిరిజన ఆవాసాలను గ్రామ పంచాయతీలుగా మార్చి గిరిజన బిడ్డలకే పాలనా అవకాశాలు కల్పించామని వివరించారు. ఆరోగ్య లక్ష్మి స్కీం ద్వారా గర్భిణులు, బాలింతలకు  పౌష్టికాహారం అందిస్తున్నామని, కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ ద్వారా ఆరోగ్య సమాజ నిర్మాణమే లక్ష్యంగా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. తర్వాత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, గవర్నర్ తమిళిసైని వనవాసీ పరిషత్ సభ్యులు ఘనంగా సన్మానించి జ్ఞాపికలను అందజేశారు. 

భద్రాచలంలో ప్రత్యేక పూజలు

భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామికి రాష్ట్రపతి ముర్ము ప్రత్యేక పూజలు చేశారు. ఎండోమెంట్ కమిషనర్ అనిల్​కుమార్, జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, ఎస్పీ వినీత్ ఆధ్వర్యంలో అర్చకులు పూర్ణ కుంభంతో ప్రెసిడెంట్‌కు స్వాగతం పలికారు. ఆలయంలో ముర్ము పేరిట అర్చన జరిగాక లక్ష్మీతాయారు అమ్మవారు, ఆంజనేయస్వామిలను దర్శించు కున్నారు. వేదపండితులు ఆశీర్వచనం ఇచ్చారు. స్వామి వారి శేషమాలికలు, పట్టు వస్త్రాలు, ప్రసాదం, జ్ఞాపికలను అందజేశారు. రాష్ట్రపతి వెంట గవర్నర్​ తమిళిసై, కేంద్ర మంత్రి కిషన్​రెడ్డి, రాష్ట్ర మంత్రి పువ్వాడ అజయ్​కుమార్, ఎంపీలు వద్దిరాజు రవిచంద్ర, మాలోత్ కవిత, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు ఉన్నారు.