దేశ రక్షణ కోసం అసాధారణ ధైర్యసాహసాలు.. 51 మందికి శౌర్య పురస్కారాలు

దేశ రక్షణ కోసం అసాధారణ ధైర్యసాహసాలు.. 51 మందికి శౌర్య పురస్కారాలు
  • కీర్తి చక్ర అందుకున్న గగన్‌యాన్ వ్యోమగామి ప్రశాంత్ నాయర్
  • ఆరుగురు అమరవీరులకు మరణానంతరం పురస్కారాలు

న్యూఢిల్లీ: దేశ రక్షణ కోసం అసాధారణ ధైర్యసాహసాలు ప్రదర్శించిన రక్షణ, భద్రతా సిబ్బందిని కేంద్ర ప్రభుత్వం అత్యున్నత పురస్కారాలతో గౌరవించింది. సోమవారం రాష్ట్రపతి భవన్‌లో జరిగిన రక్షణ నైపుణ్య పురస్కారాల (డిఫెన్స్ ఇన్వెస్టిచర్) మొదటి దశ వేడుకల్లో భాగంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మొత్తం 51 మంది వీరులకు శౌర్య పురస్కారాలను అందజేశారు. ఇందులో ఆర్మీ, వైమానిక దళం, నౌకాదళం, కేంద్ర సాయుధ పోలీసు దళాలు, రాష్ట్రాల పోలీసు సిబ్బంది ఉన్నారు. 

శతృవులను ఎదుర్కొని, ప్రాణాలకు తెగించి పోరాడిన ఆరుగురు అమరవీరులకు మరణానంతరం ఈ పురస్కారాలు దక్కాయి. అవార్డులను వారి కుటుంబ సభ్యులు అందుకున్నారు.ఈ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సహా పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.

 

  •    కీర్తి చక్ర: 7 గురికి ప్రదానం..  ఇద్దరికి మరణానంతరం. 
  •    వీర చక్ర: మొత్తం 15 మందికి.. ముగ్గురికి మరణానంతరం.
  •    శౌర్య చక్ర: మొత్తం 29 మందికి.. ఒకరికి మరణానంతరం.

గగన్‌యాన్ వ్యోమగామికి కీర్తి చక్ర

భారతదేశపు ప్రతిష్టాత్మక అంతరిక్ష యాత్ర ‘గగన్‌యాన్’ కోసం ఎంపికైన నలుగురు వ్యోమగాముల్లో ఒకరైన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ గ్రూప్ కెప్టెన్ ప్రశాంత్ బాలకృష్ణన్ నాయర్‌కు ‘కీర్తి చక్ర’ లభించింది. సవాలుతో కూడిన పరిస్థితుల్లో ఆయన కనబరిచిన ధైర్యం, అసాధారణ సేవలకు గుర్తింపుగా ఈ పురస్కారం దక్కింది.