రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ముచ్చింతల్ లోని సమతామూర్తి విగ్రహాన్ని దర్శించుకున్నారు. ఆమెతో పాటు గవర్నర్ తమిళి సై, మంత్రి సత్యవతి రాథోడ్ ఉన్నారు. స్ఫూర్తి కేంద్రంలోని 3వ నంబర్ గేట్ వద్ద త్రిదండి రామానుజ చినజీయర్ స్వామి.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు స్వాగతం పలికారు. అనంతరం శ్రీ రామ నగరంలోని 108 అడుగుల శ్రీరామానుజాచార్య విగ్రహాన్ని, రామానుజుని స్వర్ణ విగ్రహాన్ని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా త్రిదండి చినజీయర్ స్వామి రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు మంగళ శాసనాలు ఇచ్చారు. స్వర్ణ రామానుజన్ విగ్రహం.. తీర్ధ ప్రసాదాలను అందచేశారు. అనంతరం 108 ఉపాలయాలను రాష్ట్రపతి ముర్ము సందర్శించారు. ఉపాలయాల విశిష్టతను చినజీయర్ స్వామి ఆమెకు వివరించారు. రాష్ట్రపతి పర్యటన సందర్భంగా ఏర్పాటు చేసిన డైనమిక్ ఫౌంటెయిన్ షో , స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ త్రీడీ లేజర్ షోలను ముర్ము తిలకించారు. సందర్శన అనంతరం ముచ్చింతల్ నుండి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బొల్లారం బయలుదేరారు.
శుక్రవారం యాదగిరిగుట్టలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటించనున్నారు. ఉదయం హైదరాబాద్ నుంచి నేరుగా యాదగిరిగుట్టకు చేరుకోనున్నారు. తర్వాత యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామిని దర్శించుకుంటారు. రాష్ట్రపతి టూర్ తో యాదగిరిగుట్టలో పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. ప్రధాన ఆలయంతో పాటు పాటు... యాదరిగిరిగుట్టలో తనిఖీలు చేశారు. హెలిప్యాడ్ తో పాటు... నారసింహుడి ఆలయానికి వెళ్లే ఘాట్ రోడ్ ను పరిశీలించారు.

