అంబేద్కర్‌‌‌‌కు ఆదర్శం రామానుజుడే..

అంబేద్కర్‌‌‌‌కు ఆదర్శం రామానుజుడే..
  • గాంధీపైనా ఆయన ప్రభావం: రాష్ట్రపతి రామ్‌‌నాథ్ కోవింద్
  • ముచ్చింతల్‌‌లో 120 కిలోల బంగారు విగ్రహం ఆవిష్కరణ


హైదరాబాద్, వెలుగు: రామానుజాచార్యుల బోధనలే డాక్టర్ బీఆర్ అంబేద్కర్‌‌కు స్ఫూర్తినిచ్చాయని రాష్ట్రపతి రామ్‌‌నాథ్ కోవింద్ అన్నారు. ఆ స్ఫూర్తితోనే సమానత్వం, అంటరానితనంపై నిషేధం అంశాలను రాజ్యాంగంలో చేర్చారని చెప్పారు. మహారాష్ట్రలోని అంబేద్కర్‌‌ స్వస్థలం తరహాలోనే శ్రీరామనగరంలో సమానత్వం వెల్లివిరుస్తున్నదని అన్నారు. రామానుజాచార్యుల చరిత్ర చదివాకే గాంధీజీ పోరాటం మొదలైందని, గాంధీపై రామానుజాచార్యుల బోధనల ప్రభావం ఉందని తెలిపారు. ఆదివారం ముచ్చింతల్‌‌లో రామానుజ సహస్రాబ్ది ఉత్సవాల్లో రాష్ట్రపతి దంపతులు పాల్గొన్నారు. ముందుగా సమతామూర్తి విగ్రహాన్ని సందర్శించారు. తర్వాత రామానుజాచార్యుల 120 కిలోల బంగారు విగ్రహాన్ని ఆవిష్కరించి లోకార్పణ చేశారు. తర్వాత కోవింద్ మాట్లాడుతూ.. ‘‘ఈ మధ్య అంబేద్కర్ స్వగ్రామం మహారాష్ట్రలోని రత్నగిరి జిల్లా హంబ్ డావే గ్రామాన్ని సందర్శించాను. ఇప్పుడు సమతామూర్తి కేంద్రాన్ని సందర్శించాను. ఈ ప్రాంతాలు ఎంతో పవిత్రమైనవి. పీడిత వర్గాల కోసం రామానుజాచార్యులు వైష్ణవ ద్వారాలు తెరిచారు. అంబేద్కర్‌‌, గాంధీజీ, స్వామి వివేకానంద తదితరులు రామానుజాచార్యుల స్ఫూర్తితోనే సమాజంలో అసమానతలపై పోరాడారు” అని వివరించారు.


రామానుజాచార్యుల శిష్యుల్లో ఎక్కువ మంది వెనుకబడిన వర్గాల వారేనని రాష్ట్రపతి తెలిపారు. రామానుజాచార్యుల సమానత్వ ఆలోచనలు మన రాజ్యాంగంలో కనిపిస్తాయని చెప్పారు. సమతామూర్తి స్ఫూర్తితో లోక కల్యాణం కోసం కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు. భక్తితో ముక్తి లభిస్తుందని రామానుజాచార్యులు వెయ్యేళ్ల కిందటే నిరూపించారని పేర్కొన్నారు. అలాంటి మహనీయుడి స్వర్ణమూర్తిని నెలకొల్పి చినజీయర్ స్వామి చరిత్ర సృష్టించారని కొనియాడారు. గవర్నర్ తమిళిసై, పలువురు కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

స్వాగతం పలికిన గవర్నర్, సీఎం

ముచ్చింతల్ వేడుకల్లో పాల్గొనేందుకు మధ్యాహ్నం ప్రత్యేక విమానంలో బేగంపేట ఎయిర్ పోర్ట్‌‌‌‌‌‌‌‌కు రాష్ట్రపతి రామ్‌‌‌‌‌‌‌‌నాథ్‌‌‌‌‌‌‌‌ కోవింద్‌‌‌‌‌‌‌‌ దంపతులు చేరుకున్నారు. వారికి గవర్నర్‌‌‌‌‌‌‌‌ తమిళిసై, సీఎం కేసీఆర్, మంత్రి తలసాని, మేయర్ గద్వాల్ విజయలక్ష్మి స్వాగతం పలికారు. 3 గంటలకు ఎయిర్ పోర్టు నుంచి హెలికాప్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ముచ్చింతల్‌‌‌‌‌‌‌‌కు రాష్ట్రపతి చేరుకున్నారు. అక్కడ రాష్ట్రపతి దంపతులకు చినజీయర్ స్వామి స్వాగతం పలికారు. రాష్ట్రపతి తన పర్యటన ముగించుకుని తిరిగి సాయంత్రం 5 గంటలకు బేగంపేట్ ఎయిర్ పోర్ట్‌‌‌‌‌‌‌‌కు చేరుకున్నారు. అటు నుంచి రాజ్‌‌‌‌‌‌‌‌భవన్‌‌‌‌‌‌‌‌కి వెళ్లారు. సోమవారం ఢిల్లీకి తిరిగి వెళ్లనున్నారు.

మరిన్ని వార్తల కోసం

 

రామానుజాచార్యుల బంగారు విగ్రహాన్ని ఆవిష్కరించిన రాష్ట్రపతి

మోడీ గురించి మాట్లాడినప్పడు నీ కళ్లలో నీళ్లెందుకు రాలే?