రాష్ట్రంలో కొనసాగుతోన్న రాష్ట్రపతి ఎన్నికల ఓటింగ్

రాష్ట్రంలో కొనసాగుతోన్న రాష్ట్రపతి ఎన్నికల ఓటింగ్

రాష్ట్ర అసెంబ్లీలో రాష్ట్రపతి ఎన్నికల ఓటింగ్ కొనసాగుతోంది. శాసనసభా కమిటీలో హాల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో ఎమ్మెల్యేలు ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు . టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ఫస్ట్ ఓటు వేశారు. తర్వాత మంత్రులు, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వచ్చి ఓటు వేస్తున్నారు. కరోనా పాజిటివ్ రావడంతో మంత్రి గంగుల కమలాకర్ సాయంత్రం వచ్చి ఓటు వేస్తారని తెలుస్తోంది. 

అంతకుముందు తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన మాక్ పోలింగ్ కు మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు. ఓటింగ్ పై సభ్యులకు అవగాహన కల్పించారు. తర్వాత తెలంగాణ భవన్ నుంచి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బస్సుల్లో అసెంబ్లీకి చేరుకున్నారు. ఇక సీఎం కేసీఆర్ వరంగల్లో ఉన్నారు. కాసేపట్లో ఆయన వరంగల్ నుంచి వచ్చి రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకుంటారని తెలుస్తోంది. సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. రాష్ట్ర శాసనసభ్యుల ఓటు విలువ 132. మొత్తం 119 మంది ఎమ్మెల్యేలకు సంబంధించిన ఓట్ల విలువ 15 వేల 708. ఇక రాష్ట్ర అసెంబ్లీలో ఏపీ వైసీపీ ఎమ్మెల్యే మహిధర్ రెడ్డి ఓటు వేశారు. ప్రస్తుతం ఆయన హైదరాబాద్ లో ఉండడంతో ఇక్కడే ఓటు వేసేందుకు అవకాశం ఇవ్వాలని కోరినట్టు తెలుస్తోంది. 

రాష్ట్రపతి ఎన్నికల్లో రాష్ట్ర కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఓటు వేశారు.  సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, సీతక్క, పొదెం వీరయ్య, శాసనసభా కమిటీ హాల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. అంతకుముందు సీఎల్పీ భేటీలో సమావేశమైన ఎమ్మెల్యేలు . ఓటింగ్ వేసే విధానంపై చర్చించినట్టు తెలుస్తోంది. 

ప్రెసిడెంట్ పోలింగ్ సందర్భంగా ములుగు ఎమ్మెల్యే సీతక్క ఓటు విషయంలో పొరపాటు జరిగింది. ఒకరికి వేయబోయి వేరే అభ్యర్థికి సీతక్క ఓటు వేశారు. దీంతో వెంటనే అలర్ట్ అయిన సీతక్క ఇంకో బ్యాలెట్ అడిగారు. రెండో బ్యాలెట్ ను ఇవ్వకపోవటంతో తన ఓటును డబ్బాలో వేశానని సీతక్క  తెలిపారు. ఇంక్ ఎక్కువగా అంటడంతో దాన్ని కరెక్షన్ చేస్తామన్నారు.