భారత ప్రధానమంత్రి మోదీ.. ఇప్పుడు ఈ పేరు కూడా మారిపోయింది

భారత ప్రధానమంత్రి మోదీ.. ఇప్పుడు ఈ పేరు కూడా మారిపోయింది

ఇండియా పేరు మార్పుపై దేశ వ్యాప్తంగా రాజకీయ దుమారం రేగుతోంది. ప్రతిపక్షాల కూటమికి ఇండియాగా నామకరణం చేసినందుకే బీజేపీ ప్రభుత్వం దేశం పేరును ఇండియా నుంచి భారత్ గా మారుస్తోందంటూ విపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయి. ఓ వైపు దేశ వ్యాప్తంగా ఇండియా పేరును భారత్ గా మార్చడంపై చర్చజరుగుతుండగా..కేంద్ర ప్రభుత్వం మాత్రం అధికారిక కార్యక్రమాల్లో భారత్ పేరును ఉపయోగించడం మొదలు పెట్టింది. ఇప్పటికే జీ-20 డిన్నర్ మీటింగ్‌ ఆహ్వానంలో 'ప్రెసిడెంట్ ఆఫ్ భారత్' అని రాష్ట్రపతి ద్రౌపది ముర్మును పేర్కొన్నారు. తాజాగా  ప్రధాని మోదీని కూడా 'ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ భారత్‌' అని పేర్కొన్నారు. 

Also Read : నిండు కుండలా కడెం ప్రాజెక్ట్.. 3 గేట్లు ఎత్తిన అధికారులు.. ముంపు ప్రాంతాలకు హెచ్చరిక

ప్రధాని నరేంద్ర మోదీ..సెప్టెంబర్ 6, 7వ తేదీల్లో 20వ ఏసియన్‌ -ఇండియా సమ్మిట్‌,  18వ ఈస్ట్‌ ఏసియా సమ్మిట్‌ లలో పాల్గొంటారు. ఈ సమావేశాలు ఇండోనేషియాలో రెండు రోజుల పాటు జరగనున్నాయి. అయితే ప్రధాని పర్యటనకు సంబంధించి పీఎంవో నుంచి ఓ అధికారిక ప్రకటన విడుదలైంది. ఈ ప్రకటనను బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్రా షేర్ చేశారు. ఈ ప్రకటనలో భారత ప్రధానిని 'ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ భారత్‌' అని పేర్కొన్నారు. దీంతో భారత్ పేరుపై చర్చ మరింత తీవ్రమైంది. 

భారత్ పేరుపై కాంగ్రెస్‌ ఫైర్

భారత ప్రధాని పేరును ప్రైమ్ మినిస్టర్  ఆఫ్ భారత్ గా పేర్కొనడంపై కాంగ్రెస్ మండిపడింది. బీజేపీ గందరగోళ ప్రభుత్వమని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ కేంద్రంపై విరుచుకుపడ్డారు. 20వ ఏసియన్ -ఇండియా సమ్మిట్,  ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా  రెండు పదాలను ఒకే ప్రకటనలో విడుదల చేయడాన్ని ఆయన తప్పుబట్టారు.  ప్రధాని మోదీ ప్రభుత్వం ఎంతటి గందరగోళంలో ఉందో ఈ విషయంతో స్పష్టమవుతోందని ధ్వజమెత్తారు. ఇండియా పేరుతో ప్రతిపక్షాలు ఏకమవ్వడంతోనే బీజేపీ నాయకులు ఈ డ్రామా చేస్తున్నారని ఆరోపించారు.

పేరు మార్పు పక్కా..

జీ-20 డిన్నర్ మీటింగ్‌ కోసం రాష్ట్రపతి ద్రౌపతి ముర్ముకు అధికారులు అధికారిక ఆహ్వానాన్ని పంపారు. ఈ ఆహ్వానంలో సాంప్రదాయంగా ఉపయోగించే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి బదులు ప్రిసెడెంట్ ఆఫ్ భారత్ అని రాశారు. దీంతో ఇండియా పేరును రానున్న ప్రత్యేక పార్లమెంట్ సెషన్‌లో భారత్‌గా మార్చనున్నారనే ఊహాగానాలకు ఇవి బలం చేకూర్చాయి.