అమ్రాబాద్, వెలుగు: నల్లమల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తెలిపారు. మంగళవారం నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గం మన్ననూరులో ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణతో కలిసి పర్యటించారు. అమ్రాబాద్, పదర మండలాల్లో పీఎండీఏ-జేజీయూఏ పథకం కింద రూ.12.70 కోట్లతో గురుకులాల్లో వసతులు, ఇతర అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.
చెంచు గిరిజనుల స్వయం ఉపాధి, అటవీ ఉత్పత్తుల విక్రయం కోసం రూ.1.80 కోట్లతో ఆధునిక షాపింగ్ కాంప్లెక్స్‌ను నిర్మించనున్నట్లు తెలిపారు. పలు గురుకులాలను తనిఖీ చేసి విద్యార్థులతో మాట్లాడి వసతి, భోజనం తదితర అంశాలపై ఆరా తీశారు. విద్యార్థుల సమస్యలను వెంటనే పరిష్కరిస్తామని మంత్రి హామీనిచ్చారు. అనంతరం మద్దిమడుగు ఆంజనేయ స్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అడిషనల్ కలెక్టర్ దేవసహాయం, ఆర్డీవో యాదగిరి పాల్గొన్నారు.
