మియాపూర్, వెలుగు: ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో తరలిస్తున్న 18 కిలోల గంజాయిని మియాపూర్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బస్సు కండక్టర్ అప్రమత్తతతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. మియాపూర్ డీఐ రమేశ్‌నాయుడు తెలిపిన ప్రకారం.. మే 31 రాత్రి మియాపూర్ మెట్రో స్టేషన్ నుంచి షిర్డీకి వెళ్తున్న ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో ఆరుగురు వ్యక్తులు భారీ లగేజ్ బ్యాగుతో ఔరంగాబాద్ వెళ్లేందుకు ఎక్కారు.
వారి వద్ద ఉన్న బ్యాగ్‌పై అనుమానం వచ్చిన కండక్టర్ వారిని ప్రశ్నించగా, వారు బ్యాగ్‌ను అక్కడే వదిలేసి బస్సు దిగి పరారయ్యారు. దీంతో కండక్టర్ ఆ లగేజ్ బ్యాగ్‌ను మియాపూర్ పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లి అప్పగించాడు. పోలీసులు తనిఖీ చేయగా బ్యాగులో 18 కిలోల గంజాయి కనిపించింది. వెంటనే కేసు నమోదు చేసి గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. పరారైన నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. కండక్టర్‌ను కూకట్‌పల్లి డీసీపీ రితిరాజ్ అభినందించి ప్రోత్సాహక బహుమతి అందజేశారు.
