లడఖ్ రాష్ట్ర హోదా డిమాండ్‌‌కు ప్రియాంక మద్దతు

లడఖ్ రాష్ట్ర హోదా డిమాండ్‌‌కు ప్రియాంక మద్దతు

 న్యూఢిల్లీ: కేంద్ర పాలిత ప్రాంతం లడఖ్‌‌కు పూర్తి రాష్ట్ర హోదా కల్పించాలన్న అక్కడి ప్రజల డిమాండ్‌‌కు కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ వాద్రా బుధవారం మద్దతు తెలిపారు. ప్రభుత్వం తన మొండి వైఖరిని విడిచిపెట్టి ప్రజల కోరికను అర్థం చేసుకోవాలని ఆమె డిమాండ్​ చేశారు. ఈ మేరకు ఆమె ఎక్స్‌‌లో  పోస్ట్​ చేశారు. పూర్తి రాష్ట్ర హోదా డిమాండ్​తో లడఖ్ ప్రజలు గత 8 రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్న వీడియోను ప్రియాంక తన పోస్ట్​కు యాడ్​ చేశారు. లడఖ్‌‌లోని విద్యావేత్త, పర్యావరణ కార్యకర్త సోనమ్ వాంగ్‌‌చుక్ తో పాటు చాలామంది మైనస్ 15 డిగ్రీల ఉష్ణోగ్రతలో నిరాహార దీక్ష చేస్తున్నారని ఆమె చెప్పారు.

 "లడఖ్ ప్రజలు 6వ షెడ్యూల్ ప్రకారం పూర్తి రాష్ట్ర హోదాను డిమాండ్ చేస్తున్నారు. దీనిని నెరవేర్చడం ప్రభుత్వ కర్తవ్యం. ఒక వైపు చైనా ఆక్రమణ పెరుగుతోంది. మరోవైపు ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదు. బీజేపీ ప్రభుత్వం హామీని ఉల్లంఘించి.. ప్రజలను మోసం చేసింది” అని ప్రియాంక మండిపడ్డారు.