బెంగళూరు: ప్రొ కబడ్డీ లీగ్ ఎనిమిదో సీజన్‌లో అనూహ్య పరిణామం. లీగ్‌లో భాగంగా శనివారం జరిగిన మూడు మ్యాచ్‌లూ టై అయ్యాయి. తొలుత యు ముంబా, యూపీ యోధా మధ్య ఫస్ట్ ఫైట్ 28–28తో రిజల్ట్ రాలేదు. ఆ తర్వాత బెంగళూరు బుల్స్‌తో మ్యాచ్‌ను తెలుగు టైటాన్స్ 34–34తో డ్రాగా ముగించింది. చివరిదైన దబాంగ్ ఢిల్లీ కేసీ, తమిళ్ తలైవాస్ మధ్య పోరు కూడా 30–30తో టై అయింది. దాంతో, ట్రిపుల్ పంగా.. కాస్త ట్రిపుల్ టైగా మారింది. కాగా, ఈ లీగ్‌లో తెలుగు టైటాన్స్ గెలుపు రుచి చూడలేకపోతోంది. వరుసగా నాలుగో మ్యాచ్‌లోనూ బోణీ కొట్టలేకపోయింది. టైతో సీజన్‌ను స్టార్ట్ చేసిన తెలుగు టీమ్... బుల్స్‌పై గెలవాల్సిన పోరును మళ్లీ టై చేసుకుంది. ఇంకో 30 సెకండ్లలో ఆట ముగుస్తుందనగా 34–31తో మూడు పాయింట్ల లీడ్‌లో ఉన్న టైటాన్స్ ఈజీగా గెలిచేలా కనిపించింది. కానీ, ఈ టైమ్‌లో డూ ఆర్ డై రైడ్‌కు వచ్చిన అంకిత్ బెనివాల్‌ను బుల్స్ ట్యాకిల్ చేసింది. ఆపై, లాస్ట్ రైడ్‌లో కెప్టెన్ రోహిత్ కుమార్‌ను సోలో ట్యాకిల్ చేసిన బెంగళూరు బుల్స్ కెప్టెన్ పవన్ షెరావత్ తమ టీమ్‌కు ఓటమి తప్పించాడు. బెంగళూరు టీమ్‌లో చంద్రన్ రంజిత్ (9 పాయింట్లు), పవన్ (8) సత్తా చాటారు. టైటాన్స్ టీమ్‌లో అంకిత్ బెనివాల్ (10) సూపర్ టెన్ సాధించినా.. ఫలితం లేకపోయింది.

