
జడ్చర్ల/బిజినేపల్లి/సిద్దిపేట/కొండపాక:ప్రాజెక్టుల్లో భూములు కోల్పోయిన నిర్వాసితులకు చెక్కుల పంపిణీలో చిక్కులు ఎదురవుతున్నాయి. కొన్నిచోట్ల బాధితులు తమకు పరిహారం సరిపోదని నిరసనలకు దిగుతుంటే.. మరికొన్ని చోట్ల తమకు ఇంకెప్పుడు చెక్కులు ఇస్తారంటూ ప్రాజెక్టు పనులు అడ్డుకుంటున్నారు. మల్లన్నసాగర్ కింద ఇల్లు కోల్పోయినా ఇంకా పరిహారం ఇవ్వనందుకు మనస్తాపం చెందిన ఓ వ్యక్తి ఎర్రవల్లిలో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు.
ప్రాజెక్టు వద్దే వంటావార్పు
ప్రాజెక్టుల్లో భూములు కోల్పోతున్న రైతులుకు తలో న్యాయం ఉంటదా అని పాలమూరు–రంగారెడ్డి భూ నిర్వాసితులు ప్రశ్నిస్తున్నారు. పాలమూరు- ప్రాజెక్టులో భాగంగా నాగర్ కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలంలో వెంకటాద్రి రిజర్వాయర్‌ను నిర్మిస్తున్నారు. దీనికింద భూములు కోల్పోతున్న వట్టెం, కారుకొండ, కోరకొండ తండా, అనేకపల్లి గ్రామాల రైతులు మంగళవారం రిజర్వాయర్ పనులు అడ్డుకున్నారు. పనులు జరిగే ప్రాతంలోనే టెంటు వేసుకొని ధర్నాకు దిగారు. వంటావార్పు చేసుకొని నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మల్లన్న సాగర్ నిర్వాసితులకు ఎకరాకు రూ. 7.50 లక్షలు పరిహారం చెల్లిస్తుంటే.. తమకు మాత్రం ఎకరాకు రూ.4 లక్షలే ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పట్టా భూమి ఉండి, బోరు కూడా ఉంటే మరో లక్ష మాత్రం అదనంగా ఇస్తున్నారన్నారు. అది కూడా విడతల వారీగా చెల్లిస్తున్నారని, దీంతో అవి దేనికీ సరిపోవడం లేదన్నారు. భూమికి భూమితో పాటు కుటుంబానికి రూ.10 లక్షల పరిహారం, ఇంటి స్థలం, డబుల్ బెడ్‌రూం ఇల్లు కట్టియ్యాలని వారు కోరారు. లేదంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
పరిహారం ఇచ్చేదాకా ఓటేయ్యం..
జడ్చర్ల మండలం పరిధిలోని ఉదండాపూర్ రిజర్వాయర్‌లో భూములు కోల్పోయిన ఉదండాపూర్, కిష్టారం గ్రామాల రైతులు పరిహారం చెల్లించడంలో జాప్యాన్ని నిరసిస్తూ సోమవారం జరిగిన జడ్పీటీసీ ఎన్నికలను బహిష్కరించారు. పరిహారం ఇచ్చేదాకా ఓటేయంటూ పోలింగ్ కేంద్రం సమీపంలో నిరసన వ్యక్తం చేశారు. వారంలో సమస్య పరిష్కరిస్తామని తహశీల్దార్ చెప్పడంతో వారు ఆందోళన విరమించి ఓటేశారు. ఉదండాపూర్ గ్రామస్థులు ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికలను కూడా బహిష్కరించారు. అప్పుడు కూడా వారంలో సమస్య పరిష్కరిస్తామని చెప్పిన అధికారులు తర్వాత ఆ మాటే ఎత్తడం లేదని వారు విమర్శిస్తున్నారు.
నిఘా నీడలో చెక్కులు
మల్లన్నసాగర్ ముంపు గ్రామమైన తొగుట మండలం పల్లెపహాడ్‌లో పోలీసు బందోబస్తు మధ్య మంగళవారం నిర్వాసితులకు పరిహారం చెక్కులందజేశారు. కలెక్టర్ కృష్ణభాస్కర్, రాజన్న సిరిసిల్ల కలెక్టర్ వెంకట్రామిరెడ్డి ఇతర అధికారులతో కలిసి 104 కుటుంబాలకు చెక్కులు ఇచ్చారు. ఎలాంటి నిరసనలు లేకుండా అధికారులు చర్యలు తీసుకున్నారు. హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేసి ఇద్దరు
తహసీల్దార్లు నిర్వాసితుల నుంచి ఫిర్యాదులు
స్వీకరించారు.